వరంగల్ మహిళకు కెనడా ప్రభుత్వం అవార్డు

December 14, 2017


img

వరంగల్ జిల్లాలో రెడ్డిపాలెంకు చెందిన బాల ధెరిసా సింగారెడ్డి, ఆమె భర్త ఆండ్రి జింగ్రస్ లకు కెనడాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మెరిటోరియస్ సర్వీస్ డెకరేషన్’ అవార్డును కెనడా ప్రభుత్వం తరపున ఆ దేశ గవర్నర్ జనరల్ అందించారు. వారిరువురూ వివిధ దేశాలలో నిరుపేదలు, నిస్సహాయులకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా కెనడా ప్రభుత్వం ఈ అవార్డును ప్రధానం చేసింది. 

సుమారు 48 ఏళ్ళ క్రితం కెనడా దేశస్థుడైన ఆండ్రి జింగ్రస్ వరంగల్ జిల్లాలో సేవా కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు ఆయనతో బాల ధెరిసా సింగారెడ్డికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇద్దరి భావాలు కలవడంతో వారు వివాహం చేసుకొని కెనడా వెళ్ళిపోయారు. 

ఆ తరువాత వారు ‘సోపార్’, ‘బాల వికాస్’ అనే రెండు స్వచ్చంద సంస్థలను స్థాపించి వాటి ద్వారా ఏకంగా 68 దేశాలలో పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వాటిలో ‘బాల వికాస్’ సంస్థ ప్రత్యేకంగా భారత్ లో పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది. 

దాని సేవా కార్యక్రమాలు బాల ధెరిసా సింగారెడ్డి స్వంత రాష్ట్రమైన తెలంగాణా నుంచే ముందుగా మొదలుపెట్టి, ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలకు వాటిని విస్తరించింది. ఈ సంస్థ ద్వారా తెలంగాణా రాష్ట్రంలో త్రాగునీటి సమస్యలున్న ప్రాంతాలలో 800 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. సుమారు 6,500 బోర్ వెల్స్ త్రవ్వకానికి నిరుపేద రైతులకు ఆర్ధిక సహాయం అందించారు. వివిధ జిల్లాలలో 450 రక్షిత మంచినీటి ట్యాంకులు నిర్మించారు. వివిధ రాష్ట్రాలలో సుమారు 2.2 లక్షల మంది మహిళలకు, 15,000 మంది వితంతు మహిళలకు తమ కాళ్ళపై తాము నిలద్రొక్కుకొనేందుకు అవసరమైన ఆర్ధిక సహాయ సహకారాలు అందించారు. 

వివిధ జిల్లాలో సుమారు 1600 మంది అనాధ పిల్లలకు విద్యాబోధనకు అవసరమైన ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. రాష్ట్రంలో 400 ప్రభుత్వ పాఠశాలలకు బాగు చేసి వాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. దత్తత తీసుకొన్న గ్రామాలలో ఆర్గానిక్ వ్యయసాయాన్ని ప్రోత్సహించారు. 

బాల వికాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శౌరిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “త్వరలో మేము హైదరాబాద్ లో ‘బాల వికాస్ ఇంటర్నేషనల్ సెంటర్’ అనే మరో సంస్థను ఏర్పాటు చేయబోతున్నాము. దాని ద్వారా కార్పోరేట్ కంపెనీలకు సామాజిక బాధ్యతలో శిక్షణ ఇస్తాము.  ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఒక ‘ఇంక్యూ బేషన్ సెంటర్’ ను ప్రారంభించాము,” అని చెప్పారు. 

ఒకమారు మూల గ్రామంలో జన్మించిన బాల ధెరిసా సింగారెడ్డి, కెనడా దేశస్థుడైన ఆండ్రి జింగ్రస్ ను 48 ఏళ్ళ క్రితమే ప్రేమించి వివాహం చేసుకోవడమే ఒక విచిత్రమనుకొంటే, వారిరువురూ కలిసి స్థాపించిన ఈ రెండు స్వచ్చంద సంస్థలు ఇన్ని దేశాలలో పేద ప్రజలకు సేవలు అందిస్తుండటం ఇంకా ఆశ్చర్యకరమైన విషయమే. ఆమె మాతృదేశానికి దూరంగా వెళ్ళిపోయిన్నప్పటికీ, తెలంగాణా రాష్ట్రానికి, భారతదేశానికి ఇంతగా సేవలు అందించడం చాలా అభినందనీయం. కనుక ఆ దంపతులు ఈ అవార్డుకు అన్ని విధాల అర్హులేనని చెప్పవచ్చు. తెలంగాణా ప్రభుత్వం కూడా వారి సేవలను గుర్తించి సత్కరిస్తే బాగుంటుంది.  


Related Post