హిమాచల్ ప్రదేశ్ లో కూడా భాజపాయే?

December 14, 2017


img

గుజారాత్ రాష్ట్రంలో మళ్ళీ భాజపాయే ఖచ్చితంగా గెలువబోతోందని తేల్చి చెప్పిన సర్వే సంస్థలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడ భాజపా గెలువబోతోందని స్పష్టం చేస్తున్నాయి. ఈసారి గుజరాత్ ఎన్నికలలో భాజపాకు చెమటలు పట్టించిన కాంగ్రెస్ పార్టీ, తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం భాజపా చేతిలో    చావు దెబ్బ తినబోతోందని సర్వే సంస్థలు జోస్యం చెపుతున్నాయి.  

ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా సంస్థలు నిర్వహించిన తాజా సర్వే ప్రకారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో గల 68 స్థానాలలో భాజపా 47-55, కాంగ్రెస్ పార్టీ: 13-20, ఇతరులు 0-2 స్థానాలు గెలుచుకొనే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. 

ఒకవేళ రెండు రాష్ట్రాలలో సర్వే సంస్థల అంచనాలు నిజమైతే, ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న రాహుల్ గాంధీకి ఇది తొలి ఓటమి అవుతుంది. నిజానికి ఇవి ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే అయినప్పటికీ, ప్రజలు, మీడియా అవి నరేంద్ర మోడీ-రాహుల్ గాంధీ మద్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్దంగానే భావించాయి. కనుక ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో రాహుల్ గాంధీ మరొకసారి ఘోర పరాజయం పొందినట్లే భావించవచ్చు. ఈ నెల 18వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.      



Related Post