బౌన్సర్లను పెట్టి రాజీనామాలా! ఇదేమి వెర్రి జానూ?

December 14, 2017


img

గత కొంత కాలంగా ఐటి కంపెనీలు తీవ్ర ఒడిడుకులకు లోనవుతున్నందున అనేక సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించుకొంటున్నాయి. అయితే చిరకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను గౌరవంగా సాగనంపితే వారు సంతోషిస్తారు. ఆ తరువాత వారి తిప్పలేవో వారు పడతారు. కానీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలలో శాఖలు గల వెరిజాన్ డాటా సర్వీసస్ మాత్రం ఎవరూ ఊహించలేని మార్గం ఎంచుకొంది. 

ఉద్యోగంలో తొలగించదలచుకొన్న ఒక్కో ఉద్యోగికి హెచ్.ఆర్.విభాగం నుంచి మొదట పిలుపు వస్తుంది. వస్తున్నప్పుడు తమ క్యూబికల్ (వర్క్ టేబుల్) పై ఉంచుకొన్న వ్యక్తిగత వస్తువులు అంటే పుస్తకాలు, ల్యాప్ టాప్, కుటుంబ సభ్యుల ఫోటోలు వంటివాటిని అక్కడి నుంచి తీసేయమని సూచిస్తారు. తరువాత ఆ ఉద్యోగిని హెచ్.ఆర్.విభాగంలో ఒక గదిలోకి పంపిస్తారు. లోపల హెచ్.ఆర్. మేనేజర్ లేదా ఉన్నతాధికారి, ఒక సైక్రియాటిస్ట్, ఒక బౌన్సర్ ఉంటారు. 

ముందుగా ఆ ఉద్యోగికి కంపెనీ నిర్ణయం వివరించి అక్కడ టేబుల్ పై సిద్దంగా ఉంచిన రాజీనామా లేఖపై సంతకం చేయమని అడుగుతారు. ఊహించని ఈ పరిణామానికి ఆ ఉద్యోగి సహజంగానే చాలా ఆందోళన చెందుతాడు. అప్పుడు సైక్రియాటిస్ట్ రంగంలో దిగి కంపెనీ ఇస్తున్న నాలుగు నెలల జీతం తీసుకొని గౌరవంగా రాజీనామా చేసి వెళ్ళిపోవడం వలన అతనికీ, అతని కుటుంబానికి, అతని ఆరోగ్యానికి ఏవిధంగా మంచిదో వివరిస్తాడు. అప్పటికీ ఉద్యోగి సంతకం చేయకపోతే అక్కడే ఉన్న బౌన్సర్ రంగంలో దిగుతాడు. ఉద్యోగి భుజాలపై చేతులు వేసి గట్టిగా అణచివేస్తూ ‘మర్యాదగా’ సంతకం చేయమని ఒత్తిడి చేస్తాడు. కనీసం ఆ రాజీనామా లేఖలో ఏమి వ్రాసుందో చదివేందుకు కూడా అవకాశం ఇవ్వరు. ఉద్యోగి ముందు అప్పుడు ఒకటే మార్గం ఉంది. ఎదురుగా ఉంచిన రాజీనామా లేఖపై సంతకం చేయడం. లేకుంటే కుర్చీలో నుంచి బౌన్సర్ కదలనీయకుండా పట్టుకొని ఉంచుతాడు. ఆ తరువాత రాజీనామా చేసిన తరువాత ఆ ఉద్యోగిని సెక్యూరిటీ గార్డులు నేరుగా కంపెనీ పార్కింగ్ ఏరియాకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్న అతని లేదా ఆమె వాహనంలో బయటకు పంపిస్తుంటారు. అంటే దాదాపు మెడ పట్టుకొని బలవంతంగా బయటకు గెంటివేస్తోందని చెప్పవచ్చు. ఇదీ వెరిజాన్ డాటా సర్వీసస్ సంస్థలో ఉద్యోగులను తొలగించే పద్ధతి. 

 నవంబర్ 15 నుంచి ఈవిధంగా బెంగళూరు, చెన్నైలలో పనిచేస్తున్న సుమారు 500 మంది ఉద్యోగులను బయటకు పంపించారు. ఆ తరువాత హైదరాబాద్ లో 200 మంది ఉద్యోగులను బయటకు పంపించారు. దాదాపు 6-8 ఏళ్ళబట్టి వేలెత్తి చూపడానికి లేకుండా చక్కగా పనిచేసుకొంటున్నవారిని సైతం ఇదేరకంగా భయబ్రాంతులను చేసి బలవంతంగా ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించుకొని మెడ పట్టుకొని బయటకు గెంటివేస్తోంది. 

కంపెనీ తమతో వ్యవహరిస్తున్న ఈ అనుచితమైన తీరుతో ఉద్యోగులందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏరోజు ఎవరికి హెచ్.ఆర్. నుంచి పిలుపు వస్తుందోనని హడలిపోతున్నారు. బలవంతంగా రాజీనామాలు చేసినవారు కొందరు లేబర్ కమీషనర్ ను కలిసి పిర్యాదు చేశారు. లేబర్ కమీషనర్ ఏమి చర్యలు తీసుకొన్నారో లేదో తెలియదు కానీ రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.  


Related Post