అయితే విశాల్ ప్యాకప్ చెప్పేసినట్లేనా?

December 14, 2017


img

ఈనెల 21న జరుగబోయే ఆర్.కె.నగర్ ఉపఎన్నికలలో కోలీవుడ్ నటుడు విశాల్ నామినేషన్ వేయడం దానిని ఎన్నికల సంఘం తిరస్కరించడం. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలు అందరికీ తెలిసినవే. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్, సంఘం సభ్యులకు చెప్పకుండా నామినేషన్ వేసిందుకు నిరసనగా సంఘం ఉపాధ్యక్షులలో ఒకరైన ప్రముఖ దర్శకుడు పొన్ వన్నన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ దానిని వాపసు తీసుకొంటున్నట్లు నిన్న ప్రకటించారు. 

నడిగర్ సంఘంలో సభ్యులు ఎవరూ రాజకీయాలలో ప్రవేశించకూడదని ముందు అనుకొన్నామని, కానీ విశాల్ ఆ నియమాన్ని పాటించకుండా రాజకీయాలలోకి ప్రవేశించడం చేత తాను పదవి నుంచి తప్పుకోవాలనుకొన్నానని చెప్పారు. కానీ నిన్న విశాల్ తో సమావేశమైనప్పుడు మళ్ళీ ఎన్నడూ ఆవిధంగా చేయనని విశాల్ తనకు హామీ ఇచ్చారని అందుకే తన రాజీనామా లేఖను ఉపసంహరించుకొంటున్నానని పొన్ వన్నన్ తెలిపారు. 

మళ్ళీ రాజకీయాలలోకి ప్రవేశించనని విశాల్ హామీ ఇవ్వడం నిజమైతే, అయన ‘మేకప్ అండ్ ప్యాకప్’ అన్నట్లుగా ఎంత హటాత్తుగా ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారో అంతే వేగంగా నిష్క్రమించినట్లు భావించవలసి ఉంటుంది. ఇది ఊహించని పరిణామమే. ఎందుకంటే ఎన్నికల సంఘం తన నామినేషన్ తిరస్కరించడాన్ని హైకోర్టులో సవాలు చేస్తానని విశాల్ హెచ్చరించారు. కానీ మళ్ళీ రాజాకీయాలలోకి వెళ్ళనని చెప్పడం నిజమైతే ఇక అటువంటి ప్రయత్నాలు చేయబోరని అర్ధం అవుతుంది. కనుక ఇక్కడితో విశాల్ ‘రాజకీయ సినిమా’ పూర్తయిపోయినట్లే భావించవచ్చు. 

విశాల్ సినీ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు రాజకీయాలలోకి రావాలనుకోవడం తప్పు నిర్ణయమే అయినప్పటికీ, సమాజసేవపట్ల చాలా ఆసక్తి గల అతని వంటి యువకులు రాజకీయాలకు దూరంగా ఉండటం సమాజానికి కూడా నష్టమేనని చెప్పవచ్చు. 

ఆర్.కె.నగర్ ఒక్క స్థానానికి మొత్తం 145 మంది అభ్యర్ధులు నామినేషన్ వేయగా వారిలో విశాల్, దీపలతో సహా మొత్తం 73 మంది నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ఈ ఉపఎన్నికలలో పోటీ ప్రధానంగా అధికార అన్నాడిఎంకె అభ్యర్ధి మధుసూదన్, శశికళ మేనల్లుడు దినకరన్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె అభ్యర్ధి గణేశన్ మద్యనే జరుగబోతోంది. ఆర్.కె.నగర్ ఉపఎన్నికల ఫలితాలు ఈనెల 24వ తేదీన వెలువడుతాయి. 


Related Post