హార్దిక్ పటేల్ నోరు జారాడు..ఏమవుతుందో?

December 13, 2017


img

గుజరాత్ అసెంబ్లీకి గురువారం మలిదశ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఇప్పుడు కాంగ్రెస్, భాజపాలకు చాలా కీలకమైన సమయంగా చెప్పుకోవచ్చు. కనుక ఇప్పుడు రెండు పార్టీలు చాలా అప్రమత్తంగా ఉంటూ తమ తరపున చిన్న తప్పు కూడా జరుగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి కీలకసమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న పటేల్ కులస్థుల యువనేత హార్దిక్ పటేల్ నోరు జారాడు. 

అయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోడీకి తన తల్లి హీరాబెన్‌ అంటే గౌరవమని చెప్పుకొంటారు. ఆమె ఆహారం తినిపిస్తుంటే ఫోటోలు తీయించుకొని గొప్పగా ప్రదర్శించుకొంటారు. మరి గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వచ్చి రాష్ట్రంలోనే తిరుగుతున్నప్పుడు ఒక్కసారి కూడా ఆమె మొహం ఎందుకు చూడలేదు?” అని ప్రశ్నించారు. 

97 ఏళ్ళు వయసున్న ప్రధాని తల్లిని ఈ రాజకీయ రొంపిలోకి లాగేందుకు హార్దిక్ పటేల్ ప్రయత్నించడంపై నెటిజన్స్ అతనిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోని గుజరాత్ ప్రజలు హార్దిక్ పటేల్ ఆమె ప్రస్తావన చేయడాన్ని నిరసిస్తున్నారు. రేపు పోలింగ్ జరుగబోతున్న ఈ తరుణంలో హార్దిక్ పటేల్ ఈవిధంగా నోరు జారడంతో తమ విజయావకాశాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపుతుందోనని కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన చెందుతోంది.  


Related Post