రైతన్నలూ..ఇంకెందుకే ఆటో స్టార్టలు?

December 13, 2017


img

తెలంగాణా ఏర్పడక ముందు విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొని ఉండేవి. కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడే నీళ్ళ పంపులు ఆన్ చేసుకొని పొలాలకు నీళ్ళు పెట్టుకోవలసి వచ్చేది. ఆ కారణంగా రైతన్నలు రేయింవళ్ళు తమ పొలాల వద్దనే పడిగాపులు కాయవలసిన దుస్థితి నెలకొని ఉండేది. ఈ సమస్యకు విరుగుడుగా ఆటో స్టార్టలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని బిగించుకొంటే కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు మోటార్లు ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి పొలాలకు నీళ్ళు అందేవి.

అయితే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తెరాస సర్కార్ ఈ విద్యుత్ కష్టాలను పరిష్కరించడమే కాకుండా ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో వ్యవసాయరంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే అనేక జిల్లాలలో ప్రయోగాత్మకంగా నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోంది. కనుక ఇక కరెంట్ కోసం రైతన్నలు ఎదురుచూపులు చూడనక్కరలేదు. కనుక ఇదివరకు అయ్యేందుకు బిగించుకొన్న ఆటో స్టార్టలను తొలగించుకోవలసిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. 

ఇప్పుడు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుంది కనుక రైతన్నలకు ఎప్పుడు నీళ్ళు అవసరమనుకొంటే అప్పుడే నీళ్ళ పంపులు ఆన్ చేసుకొని ఉపయోగించుకొనే వెసులుబాటు ఏర్పడింది కనుక ఇంకా ఆటో స్టార్టలను ఉంచినట్లయితే, నీళ్ళ పంపులు ఎప్పుడూ ఆన్ లోనే ఉంటాయి. అప్పుడు అవి అవసరమున్నా లేకపోయినా భూమిలో నీటినంతా తోడేస్తుంటాయి. భూమిలో నీళ్ళు అయిపోయిన తరువాత కూడా అవి ఇంకా పనిచేస్తూనే ఉంటాయి కనుక అప్పుడు మోటార్లు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. పైగా భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతాయి. 

కనుక రైతన్నలు అందరూ స్వచ్చందంగా ఆటో స్టార్టలను తొలగించుకొని అవసరమైనప్పుడు, అవసరమైనన్ని నీళ్ళు మాత్రమే భూమిలో నుంచి తోడుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయితీ పెద్దలు, వ్యవసాయ, విద్యుత్ శాఖల సిబ్బంది అందరూ కూడా ఈ ఆటో స్టార్టల వలన కలిగే నష్టాలను రైతన్నలకు వివరించి వాటిని వారు తొలగించుకొనేలా చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు. అవును కదా! ఇప్పుడు నిరంతరం విద్యుత్ సరఫరా అవుతున్నప్పుడు రైతన్నలూ..ఇంకెందుకే మనకీ ఆటో స్టార్టలు? 


Related Post