టి-కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో?

December 12, 2017


img

2014 ఎన్నికలలో జాతీయస్థాయిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ముందే ఖాయం అయిపోయినప్పటికీ, కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణా రాష్ట్రంలో మాత్రం మంచి విజయావకాశాలు ఉన్న మాట వాస్తవం. కానీ టి-కాంగ్రెస్ నేతలు స్వయంకృతాపరాదం వలన చేజేతులా విజయాన్ని చేజార్చుకొన్నారు. ఆ తరువాత ఫిరాయింపుల కారణంగా కొంత బలహీనపడినప్పటికీ, ఆ పార్టీ నేతల స్వీయబలం, పార్టీపై అభిమానం, అలుపెరుగని వారి పోరాటాల కారణంగా నేటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడింది. తెరాసను గట్టిగా డ్డీ కొంటోంది కూడా. గత ఎన్నికలలో చేసిన తప్పిదాలను కాంగ్రెస్ అధిష్టానం కూడా బాగానే గుర్తించినట్లుంది. అందుకే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అండగా నిలబడటమే కాకుండా పార్టీలో ఎవరూ ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించడానికి వీలులేదని, వచ్చే ఎన్నికలను ఆయన నాయకత్వంలోనే ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. ఈ వైఖరి వలన పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నప్పటికీ, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అటువంటి ధృడమైన వైఖరి అవసరమేనని చెప్పవచ్చు. కనుక వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి అధికారం చేజిక్కించుకోగలమనే నమ్మకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనబడుతోంది. 

వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం కోసం అది చాలా కాలం క్రితం నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఆ ప్రయత్నాలలో భాగంగానే అది రేవంత్ రెడ్డిని పార్టీలోకి ఆకర్షించింది. రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్ ను తన బద్దశత్రువుగా భావిస్తున్నారు కనుక ఆయన కూడా రాష్ట్రంలో పర్యటిస్తూ తెదేపా, తెరాస కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షిస్తూ, పార్టీని బలోపేతం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ నేతల రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంటుంది కనుక వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ జీవన్మరణ సమస్యగా తీసుకొని పోరాడే అవకాశం ఉంది కనుక తెరాసకు అది చాలా గట్టి పోటీనీయవచ్చు. అయితే వచ్చే ఎన్నికలలో మళ్ళీ తమ గెలుపు ఖాయమని తెరాస కూడా బల్లగుద్ది చెపుతోంది. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపించబోతున్నాయని తెరాస నేతలు, మంత్రులు నమ్మకంగా చెపుతున్నారు. కనుక వచ్చే ఎన్నికలు చాలా ఆసక్తికరంగా, రసవత్తరంగా ఉండబోతున్నాయి. 


Related Post