భాజపాతో తెరాస రణమా..స్నేహమా?

December 12, 2017


img

తెలంగాణాలో తెదేపాకు దూరం అయిన తరువాత భాజపా బలహీనపడినట్లు కనిపిస్తోంది. అదేవిధంగా ఫిరాయింపులతో చాలా బలహీనపడిన తెదేపా, రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిన తరువాత ఇంకా బలహీనపడినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఈ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికలలో చేతులు కలిపే ఉద్దేశ్యం లేనట్లే కనిపిస్తోంది. ఆ రెండు పార్టీలు ప్రస్తుతం తెరాస సర్కార్ తో పోరాటాలు చేస్తున్నప్పటికీ, తెరాస అంగీకరిస్తే దానితో స్నేహం చేయాలనే తలంపుతో ఉన్నట్లు పరోక్షంగా చాలా సంకేతాలే ఇచ్చాయి. కానీ బలహీనంగా ఉన్న ఆ రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకొని వాటికి తన అధికారంలో భాగం పంచి ఇవ్వవలసిన అవసరం తెరాసకు లేదు.

ఏదోనాడు ‘అవశేష తెదేపా’ తెరాసలో విలీనం అయిపోయినా ఆశ్చర్యం లేదు కనుక దాని గురించి ఆలోచించవలసిన అవసరం తెరాసకు లేదనే చెప్పవచ్చు. ఇక భాజపా విషయానికి వస్తే వచ్చే ఎన్నికలలో దానిని ఎవరూ ఓడించనవసరం లేదు. దానంతట అదే ఓడిపోయే అవకాశాలే ఎక్కువ. కనుక భాజపాతో స్నేహం  గురించి కూడా ఆలోచించనవసరం లేదు. భాజపాతో స్నేహం కంటే మజ్లీస్ పార్టీతో స్నేహం వలన రాష్ట్ర స్థాయిలో తెరాసకు ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ భాజపాతో కంటే మజ్లీస్ పార్టీతో స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పవచ్చు. 

అయితే 2019 ఎన్నికల తరువాత కూడా కేంద్రంలో మళ్ళీ భాజపా అధికారంలో కొనసాగే అవకాశం ఉంది కనుక, ఒకవేళ ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయస్థాయి రాజకీయాలలోకి వెళ్ళదలిస్తే మాత్రం సరిగ్గా ఎన్నికలకు ముందు భాజపా చెయ్యి అందుకొనే అవకాశాలున్నాయి. అప్పుడు తన కుమారుడు కేటిఆర్ కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించవచ్చు. కేటిఆర్ అందుకు అన్ని విధాల అర్హుడు, సమర్ధుడు అని ఇప్పటికే నిరూపించుకొన్నారు కూడా.

కనుక తెరాస-భాజపాల పొత్తులు కెసిఆర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి తప్ప భాజపా అవసరాలు, ఆలోచనలనుబట్టి కాదని చెప్పవచ్చు. 

గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించి, పార్టీకి దిశానిర్దేశం చేయబోతున్నారని సమాచారం. 'దక్షిణాది రాష్ట్రాలలో భాజపా అధికారంలోకి రావడానికి తెలంగాణా రాష్ట్రం అత్యంత అనుకూలమైన రాష్ట్రమని, కనుక ప్రతీ 3 నెలలకు ఒకసారి తెలంగాణాలో తప్పకుండా పర్యటిస్తానని' అమిత్ షా గతంలో చెప్పారు. అయితే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో భాజపా పరిస్థితిని ప్రకారం చూసినట్లయితే, తెలంగాణా రాష్ట్రంలో భాజపా గౌరవప్రదమైన స్థానాలు సంపాదించుకోవడం కూడా కష్టమేనని అర్ధం అవుతుంది. కనుక అమిత్ షా పర్యటనలతో రాష్ట్ర రాజకీయాలలో, భాజపా పరిస్థితిలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశాలు లేనట్లే కనబడుతోంది. కానీ అమిత్ షాను తక్కువ అంచనా వేయలేము కనుక ఆయన ఈ పరిస్థితులను మార్చడానికి ఏమి మ్యాజిక్ చేస్తారో చూడాలి. 


Related Post