మోడీ తప్పటడుగుకు భాజపా మూల్యం చెల్లించబోతోందా?

December 12, 2017


img

నేటితో గుజరాత్ రెండవ దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగుస్తుంది. రాష్ట్రంలో భాజపాకు ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ప్రజలను ఆకట్టుకొనడంలో సఫలం అయ్యారనే చెప్పవచ్చు. సీనియర్ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ తనను ‘నీచుడు’ అని సంభోదించడంతో ప్రధాని నరేంద్ర మోడీ దానినే తన ప్రచారంలో హైలైట్ చేసి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికర పరిస్థితులలోకి నెట్టగలిగారు. అయితే అయన అక్కడితో ఆగిపోయుంటే బాగుండేది కానీ మరో అడుగు ముందుకు వేసి, కాంగ్రెస్ పార్టీ తనను అంతమొందించేందుకు పాకిస్తాన్ తో చేతులు కలిపిందని, పాక్ నేతలతో కాంగ్రెస్ నేతలు రహస్యంగా సమావేశమయ్యారని, గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పాక్ తెర వెనుక నుంచి పావులు కదుపుతోందని, ఎన్నికలలో పాకిస్తాన్ జోక్యం చేసుకొంటోందని ఆరోపణలు చేసి ప్రజల సానుభూతి పొందాలని చూశారు. కానీ అయన ఆరోపణలు అబద్దమని పాకిస్తాన్, కాంగ్రెస్ పార్టీ రెండూ స్పష్టం చేశాయి. 

మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో సహా పలువురు ప్రముఖులు, పాత్రికేయులు పాల్గొన్న సమావేశం రహస్య సమావేశం ఎలా అవుతుందనే కాంగ్రెస్ ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోడీ, భాజపాలు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోవడంతో భాజపా, మోడీ అభాసుపాలైయ్యారు. ఓటమి ఖాయం అని గ్రహించినందునే మోడీ ఆవిధంగా అర్ధపర్ధంలేని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ గట్టిగా వాదించింది. 

మహారాష్ట్రలో భాజపాకు మిత్రపక్షమైన శివసేన తన అధికారక పత్రిక ‘సామ్నా’లో ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేసింది. “ఎప్పుడూ అభివృద్ధి గురించి మాట్లాడే మోడీ ఈసారి గుజరాత్ ప్రజల సానుభూతి సంపాదించుకొని భాజపాను గెలిపించుకోవడం కోసం తన స్థాయిని పూర్తిగా దిగజార్చుకొని మాట్లాడారు. మణిశంకర్ అయ్యర్ చేసిన ఆరోపణలను తెలివిగా ఉపయోగించుకోవాలనే తాపత్రయంతో అయన తన గౌరవాన్ని గుజరాతీయుల ఆత్మగౌరవంతో ముడిపెట్టుకొని చాలా చవుకబారు రాజకీయాలు చేశారు. మోడీ దేశంలో హిందువులు అందరికీ గర్వకారణం అని మేమనుకొన్నాము. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ తన స్థాయిని పూర్తిగా దిగజార్చుకొన్నారు. అయన చేసిన ఆరోపణలు ‘గల్లీ లీడర్ కు ఎక్కువ, డిల్లీ లీడర్ కు తక్కువ’ అన్నట్లుగా ఉన్నాయి,” అని శివసేన విమర్శించింది. గత 42 నెలలో దేశంలో అనేకసార్లు ఎన్నికలు జరిగాయి కానీ ఎప్పుడూ మోడీదే పైచెయ్యిగా ఉండేది. మొట్టమొదటిసారిగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీకి వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. రాష్ట్ర భాజపా విజయావకాశాలపై ఇది ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. ఈ నెల 14న మలిదశ పోలింగ్ జరుగుతుంది. 18న ఫలితాలు వెల్లడవుతాయి.  


Related Post