హైదరాబాద్ నగరంలో కటేదాన్ పరిధిలోగ మైలార్ దేవ్ పల్లికి చెందిన లక్ష్మీరాజ్ గౌడ్ అనే తెరాస కార్యకర్త శుక్రవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నివాసం ముందు ఆత్మహత్యా ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న ఆ డివిజన్ తెరాస అధ్యక్షుడు సరికొండ వెంకటేష్, తెరాస కార్యకర్తలు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకొని ఆసుపత్రికి తరలించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వార్డు సభ్యురాలిగా ఉండేదానినని, తెరాసను నమ్ముకొని పార్టీ మారి, స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేశానని కానీ అందరూ కలిసి తనకు అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. తనకు మైలార్ దేవ్ పల్లి డివిజన్ వార్డు కమిటీలో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు అందరూ తనను పక్కన పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. చిరకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నా తనను కాదని కొట్టగా పార్టీలో చేరినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చెప్పినా మేయర్ ఆయన మాటను పట్టించుకోకుండా కార్పొరేటర్ సూచించిన వారికి వార్డు కమిటీలలో స్థానం కల్పించడం ఏమిటని లక్ష్మీరాజ్ గౌడ్ నిలదీశారు.
లక్ష్మీరాజ్ గౌడ్ ఆవేదన అర్ధం చేసుకోదగిందే కానీ రాజకీయ పార్టీలలో ఇంత దిగువ స్థాయిలో కూడా అందరికీ పదవులు, అధికారం సంపాదించుకోవాలనే ఆరాటమే తప్ప ప్రజాసమస్యల పరిష్కారం చేయాలనే తపన కనిపించకపోవడం బాధాకరమే. పదవి రాకపోతే జీవితమే వ్యర్ధం అనుకొనే స్థాయికి దిగజారిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.