భాజపా వ్యూహంతో రాహుల్ తికమక?

December 08, 2017


img

గుజరాత్ అసెంబ్లీకి మొదటిదశ పోలింగ్ రేపు (శనివారం) జరుగబోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈసారి అనుకూల వాతావరణం ఏర్పడినందున భాజపా చాలా తెలివిగా పావులు కదుపుతోంది. సీనియర్ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశ్యించి ‘నీచుడు’ అని అన్న మాటను హైలైట్ చేసి, దానిని గుజరాతీయుల ఆత్మగౌరవంతో ముడిపెట్టేసి వారి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో, కాంగ్రెస్ అధిష్టానం హడావుడిగా మణిశంకర్ అయ్యర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఈ సమస్య నుంచి బయటపడాలని ప్రయత్నించింది. ఇది గ్రహించిన భాజపా ఇప్పుడు మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ ప్రస్తావన చేసి రాహుల్ గాంధీని తికమక పెడుతోంది. 

న్యాయవాది అయిన కపిల్ సిబాల్ ప్రస్తుతం బాబ్రీ మశీదు-అయోధ్య రామ మందిరం కేసులో ముస్లిం సంస్థల తరపున న్యాయస్థానంలో వాదిస్తున్నారు. ఈ సందర్భంగా బాబ్రీపై ఇప్పటికిప్పుడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించినట్లయితే, దానిని భాజపా 2019 ఎన్నికలలో తనకు అనుకూలంగా వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తుందని, కనుక 2019 ఎన్నికల తరువాతే తుది తీర్పు వెలువరించాలని ఆయన వాదించారు. అయితే సుప్రీం కోర్టు ఆయన వాదనను త్రోసిపుచ్చి విచారణను కొనసాగిస్తోంది. 

ఇదే విషయం ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించి, “నా పట్ల అనుచితంగా మాట్లాడినందుకు మణిశంకర్ అయ్యర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం, 2019 ఎన్నికలు పూర్తయ్యేవరకు అయోధ్య-బాబ్రీ కేసుపై తీర్పు వాయిదావేయాలని కోరితే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని ప్రశ్నించారు. దీనినే మరోవిధంగా చెప్పాలంటే దేశంలో హిందువులు అందరూ ఈ వివాదం పరిష్కారమయ్యి వీలైనంత త్వరగా అయోధ్యలో రామాలయం నిర్మించబడాలని కోరుకొంటుంటే, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకొంటోందని మోడీ చెపుతున్నట్లు భావించవచ్చు. 

గుజరాత్ లో హిందూ ఓటర్లు చాలా ఎక్కువ గనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కపిల్ సిబాల్ పేరు ఎత్తడానికి కూడా సంకోచిస్తోంది. అది గ్రహించిన భాజపా అయన పేరును ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీని మళ్ళీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. మరి భాజపా విసురుతున్న ఈ సరికొత్త సవాలు ను రాహుల్ గాంధీ ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి. 


Related Post