తెలంగాణాలో ఉన్నది తెలంగాణావాదమే!

December 08, 2017


img

ప్రస్తుతం ఏపిలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలను పోల్చుతూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో కులాల ఆధిపత్యపోరు ఇంకా సాగుతోంది కానీ తెలంగాణాలో కులాల ఊసు లేదు..కులాల మద్య కొట్లాటలు కనబడవు. అక్కడ కేవలం తెలంగాణావాదమే ఉంది. అందరూ అభివృద్ధి గురించే ఆలోచిస్తుంటారు. హైదరాబాద్ మల్టీ కల్చర్ సిటీ. అందుకే బాబు హైదరాబాద్ నగరాన్ని సులువుగా అభివృద్ధి చేయగలిగారు. మనం కూడా కులాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేయగలిగితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుంది. కులాల గురించి ఆలోచిస్తూ రాజకీయాలు చేసుకొంటే రాష్ట్రం ఎన్నటికీ అభివృద్ధికి నోచుకోదు,” అని అన్నారు.

పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ విషయం అక్షరాల సత్యం అని చెప్పవచ్చు. అలనాడు స్వాతంత్ర్య పోరాటంలో యావత్ దేశప్రజలు కులమతాలు, ప్రాంతాలు, బాషలు, సంస్కృతులకు అతీతంగా ఏవిధంగా కలిసికట్టుగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించుకొన్నారో, తెలంగాణా సాధన కోసం తెలంగాణా ప్రజలందరూ కూడా అదేవిధంగా కలిసికట్టుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా అందరూ రాష్ట్రాభివృద్ధి గురించే ఆలోచిస్తున్నారు...మాట్లాడుకొంటున్నారు తప్ప ఎవరూ కులమతాల ఊసే ఎత్తడం లేదు. మనమందరం తెలంగాణావాసులం. మనది తెలంగాణావాదం. మనది అభివృద్ధిపధం అని ఏకగొంతుతో నినదిస్తూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణా రాష్ట్రాభివృద్ధి పట్ల ప్రజల ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో గుర్తించిన తెరాస సర్కార్ కూడా అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతోంది. అయితే ఈ మహాయజ్ఞంలో కూడా కొన్ని లోపాలు, అవకతవకలు జరగడం సహజం కనుక వాటినే ప్రతిపక్షాలు ఎత్తిచూపుతూ ఆయుధాలుగా వాడుకొంటున్నాయి. అయితే ప్రతిపక్షాలు కూడా ప్రజల ఆకాంక్షలు అర్ధం చేసుకొన్నాయి కనుక అవి కూడా కులరాజకీయాలు చేసేందుకు మొగ్గు చూపడం లేదని చెప్పవచ్చు. కనుక పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఆంధ్రాలో ప్రజలు కూడా కులాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా రాష్ట్రాభివృద్ధి చేయగలిగినవారికే మా ఓటు అని పాలకులకు, ప్రతిపక్ష పార్టీలకు కూడా  తెలిసివచ్చేలా చేయడం చాలా అవసరం. అప్పుడే తెలంగాణా రాష్ట్రంలో మాదిరిగా ‘అభివృద్ధి కళ్ళకు కనబడుతుంది.’ 


Related Post