గుజరాత్ అసెంబ్లీకి రేపు మొదటి దశ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో భాజపా సర్కార్, కేంద్రంలో మోడీ సర్కార్ స్వీయ తప్పిదాల కారణంగా ఇన్నాళ్ళకు గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ఇటువంటి గొప్ప అవకాశం కోసమే కాంగ్రెస్ పార్టీ గత రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తోంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి రాహుల్ గాంధీ చాలా చెమటోడ్చుతున్నారు. ఇటువంటి కీలకమైన తరుణంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కాంగ్రెస్ పార్టీ చేతికి విజయం అందినట్లే అంది చేజారిపోయే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు సరిగ్గా అదే జరిగింది.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ‘ప్రధాని నరేంద్ర మోడీ నీచుడు..అటువంటి వ్యక్తి గురించి మాట్లాడటం అనవసరం’ అని అన్నారు. సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న భాజపా నేతలు దానిని తమ ఎన్నికల ప్రచారంలో హైలట్ చేసి, ‘కాంగ్రెస్ పార్టీ ఆవిధంగా మాట్లాడి యావత్ గుజరాతీయులను అవమానించిందని, గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రధానమంత్రినే గౌరవించలేని కాంగ్రెస్ పార్టీ గుజరాతీయులను గౌరవిస్తుందా?’ అని గుజరాతీయులలో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
సాధారణ సమయంలోనైతే ఇటువంటి వ్యాఖ్యలను ఎవరు చేసినా భాజపా కూడా వాటిని తిప్పి కొట్టి ఊరుకొని ఉండేది. కానీ ఎన్నికల సమయం కావడంతో వాటిని తమకు అనుకూలంగా మలుచుకొని చెలరేగిపోతోంది.
మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలతో జరిగిన నష్టాన్ని గ్రహించిన రాహుల్ గాంధీ వాటిని వెంటనే ఖండించారు. అయన చేత ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పించారు కూడా. అయినా కూడా భాజపా ఎదురుదాడి ఆగకపోవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఒక సీనియర్ నేతను ఇటువంటి కారణంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చాలా ఆశ్చర్యకరమే కానీ గుజరాత్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాహుల్ గాంధీ ఇంత తీవ్ర నిర్ణయం తీసుకొన్నారని చెప్పవచ్చు. తద్వారా హద్దు మీరితే ఎంతటివారినైనా తను ఉపేక్షించబోనని స్పష్టమైన సంకేతం పంపినట్లయింది కూడా. అయితే గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మణిశంకర్ అయ్యర్ సంజాయిషీని అంగీకరించి, ఆయనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేసినా ఆశ్చర్యం లేదు. అది వేరే సంగతి. కానీ ప్రస్తుతం మాత్రం రాహుల్ గాంధీ చాలా చురుకుగానే వ్యవహరించారని చెప్పవచ్చు.