తెలంగాణా రాష్ట్రంలో ముస్లింలకు ప్రస్తుతం ఉన్న 4 శాతం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని ఏపి సిఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వారు కేవలం హామీలతోనే సరిబెట్టేయకుండా, శాసనసభలో వాటి కోసం బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి కేంద్రానికి పంపించారు కూడా.
అయితే వాటి కోసం కేంద్రం పార్లమెంటులో చట్టసవరణ చేయడానికి సిద్దపడుతుందా? అంటే అనుమానమే. ఎందుకంటే రిజర్వేషన్ల అంశాన్ని కదపడం అంటే తేనె తుట్టెను కదపడమే. కనుక రెండు తెలుగు రాష్ట్రాల కోసం దానిని కదిపితే దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా అటువంటి డిమాండ్లు మొదలవుతాయి. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో పటేల్ కులస్తులు, రాజస్థాన్ లో గుజ్జర్లు..ఇంకా వివిధ రాష్ట్రాలలో వివిధ కులాలు, మతాలవారికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్స్ ఉన్నాయి.
గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇవ్వడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ, “50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయినా రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై ఈవిధంగా హామీ ఇస్తున్నారంటే ప్రజలను మభ్య పెట్టడానికే,” అని అన్నారు.
“50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచడం సాధ్యం కాదని మోడీ చెపుతున్నప్పుడు మరి కెసిఆర్, చంద్రబాబు నాయుడు ఏవిధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇస్తున్నారని” రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇరువురు ముఖ్యమంత్రులు ప్రజలను మభ్యపెట్టడానికే ఆవిధంగా హామీలు గుప్పిస్తున్నారని అన్నారు.
అయితే షబ్బీర్ అలీ కూడా ఒక విషయం విస్మరిస్తున్నారు. తమ కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అదే హామీతో గుజరాత్ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మరిచినట్లున్నారు.
ఏది ఏమైనప్పటికీ రిజర్వేషన్ల పెంపు అనేది రాష్ట్రాల పరిదిలోనిది కాదనే సంగతి ఇరువురు ముఖ్యమంత్రులకు బాగా తెలుసు. కనుక రిజర్వేషన్లు కల్పించినా కల్పించలేకపోయినా వారికి ఫరక్ పడదని చెప్పవచ్చు. ఒకవేళ కేంద్రం వారి ప్రతిపాదనలను ఆమోదిస్తే, ఆ క్రెడిట్ తెరాస, తెదేపాలే స్వంతం చేసుకోవడం ఖాయం. కానీ ఎలాగూ ఆమోదించే అవకాశం లేదు కనుక తాము ఆయా వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు ఇవ్వాలని గట్టిగా కోరుకొంటునప్పటికీ, కేంద్రం అందుకు సహకరించడం లేదని నిందిస్తూ రాష్ట్రాలలో భాజపాను దోషిగా నిలబెట్టవచ్చు. ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకొని వారి ఓట్లను సంపాదించుకోవచ్చు. కనుక రిజర్వేషన్ల అంశం తెదేపా, తెరాసలకే తప్ప సదరు వర్గాల ప్రజలకు ఉపయోగపడేది కాదని చెప్పకతప్పదు.