అక్కడ జగన్...ఇక్కడ ఉత్తమ్..

December 01, 2017


img

శాసనసభ ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే సమయం ఉంది కానీ అధికారం కోసం ఆరాటపడుతున్న ప్రతిపక్ష పార్టీ నేతలు  అప్పుడే పాదయాత్రలు, బహిరంగ సభల పేరుతో ప్రజల మద్యకువెళ్ళి నోటికి వచ్చిన వాగ్దానాలను ఇచ్చేస్తున్నారు. ఈ విషయంలో ఏపిలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ముందుండగా, తెలంగాణాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండవ స్థానంలో ఉన్నారు. పంటరుణాల మాఫీ హామీతో ప్రజలను మభ్యపెట్టి 2014 ఎన్నికలలో గెలిచి అధికారం వచ్చేందుకే చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని విమర్శించిన జగన్, ఇప్పుడు అంతకంటే అసాధ్యమైన హామీలను గుప్పిస్తూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేటలో జాన్ పహాడ్ వద్ద రైతులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మా కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే తెలంగాణాలో అనేక సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశాము. కానీ తెరాస సర్కార్ అన్నీ తామే చేశామని గొప్పలు చెప్పుకొంటోంది తప్ప అది కొత్తగా చేసిందేమీ లేదు. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే గెలిచి తెలంగాణాలో అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు మూసీనదిపై చెక్ డ్యాం నిర్మిస్తాము. తెరాస సర్కార్ లక్ష రూపాయల పంట రుణాల మాఫీని నాలుగు విడతలలో చెల్లించింది కానీ దాని వలన రైతులకు ఎటువంటి ప్రయోజనం కలుగకపోగా వారిపై వడ్డీభారం కూడా పడింది. మేము అధికారంలోకి వస్తే ఒకేసారి రెండు లక్షలు మాఫీ చేస్తాము. ఇక నిరుద్యోగ భ్రుతి క్రింద నిరుద్యోగ యువతీయువకులకు నెలకు రూ.3,000 చొప్పున ఇస్తాము,” అని హామీలు ఇచ్చారు. 

తెలంగాణా ఆర్ధికంగా చాలా బలంగా ఉన్నప్పటికీ లక్ష రూపాయల పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వాయిదాలలో తీర్చవలసి వచ్చిందంటే, ఆ హామీని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో అర్ధం చేసుకోవచ్చు. ఇక నిరుద్యోగ భ్రుతి ఇస్తామని హామీ ఇచ్చిన ఏపి సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు కావస్తున్నా ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేకపోతోంది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడి నుంచి నిధులు తీసుకువచ్చి ఒకేసారి రెండు లక్షలు పంట రుణాలను తీర్చేస్తామని, నెలకు రూ.3,000 నిరుద్యోగ భ్రుతి ఇచ్చేస్తామని చెపుతున్నారో ఆయనకే తెలియాలి. అధికారంలోకి వచ్చేందుకు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తే అధికారంలోకి వచ్చేక ప్రభుత్వాలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో ఏపి, తెలంగాణా ప్రభుత్వాలను చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, వైకాపాలే ప్రభుత్వాలను విమర్శిస్తూ, మళ్ళీ అవి కూడా ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పిస్తుండటం విస్మయం కలిగిస్తుంది. 


Related Post