దేశ ప్రవర్తనలో మార్పు వచ్చింది: మోడి

December 01, 2017


img

నోట్లరద్దు, జి.ఎస్.టి.పై ప్రతిపక్షాలు, దేశంలో వివిధవర్గాల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ, వాటికి చాలా ధీటుగా బదులిచ్చారు. న్యూడిల్లీలో నిన్న జరిగిన హిందూస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో ప్రసంగిస్తూ, “దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కటినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడను. అందుకు రాజకీయంగా మూల్యం చెల్లించవలసి వచ్చినా భయపడను. నోట్లరద్దుతో ‘దేశం ప్రవర్తన’లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఎంతటివారైనా సరే ఆర్ధిక నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు దేశ ఆర్ధిక వ్యవస్థను సమాంతరంగా నడిపించిన నల్లధనం ఇప్పుడు దేశఆర్ధిక వ్యవస్థలో కలిసిపోయింది. నోట్లరద్దు తరువాత 2.20 లక్షల సూట్ కేసు కంపెనీల ఉనికి బయటపడింది. వాటన్నిటి లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా, వాటిని నిర్వహించినవారు మళ్ళీ మరోచోట పనిచేయలేని పరిస్థితి కల్పించాము.”       

“నోట్ల రద్దు తరువాత నగదురహిత లావాదేవీలు, జి.ఎస్.టి. అమలులోకి రావడంతో ఆర్ధికలావాదేవీలలో పూర్తి పారదర్శకత వస్తోంది. ఇప్పుడు దేశంలో ఉన్న ప్రతీ పైసాకు లెక్కలు కనబడుతున్నాయి. ఆ కారణంగా ఇప్పుడు నల్లధనం ఎక్కడ పోగుపడినా సులభంగా కనుగొనేందుకు వీలుపడుతోంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచంలో 5 బలహీన ఆర్దికవ్యవస్థలున్న దేశాలలో భారత్ కూడా ఒకటిగా ఉండేది. మా ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణలు, తీసుకొన్న కటిన నిర్ణయాల కారణంగా ఈ మూడున్నరేళ్ళ వ్యవధిలోనే మన దేశ ర్యాకింగ్ బాగా మెరుగుపడింది. వృద్ధిరేటు కూడా పెరిగింది. ఇప్పుడు ప్రపంచ దేశాలలో భారత్ కు ప్రత్యేక గుర్తింపు లభిస్తోందటే మా ప్రభుత్వం తీసుకొన్న కటిన నిర్ణయాలే కారణమని చెప్పగలను,” అని అన్నారు.

“దేశవ్యాప్తంగా ఎల్.ఈ.డి. బల్బులను వినియోగంలోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం రూ.14,000 కోట్లు ఖర్చు పెట్టింది. మాకు మా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అని భావించి ఉండి ఉంటే, ఆ డబ్బును జనాధారణ పధకాలపై ఖర్చు చేసి ఉండి ఉంటే మరో 50 సం.ల వరకు ప్రజలు మమ్మల్నే గెలిపిస్తూ ఉండేవారు. కానీ మా ప్రభుత్వ లక్ష్యం అది కాదు. భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, ప్రపంచ దేశాలలో శక్తివంతమైన దేశాలలో ఒకటిగా నిలపాలన్నది మా లక్ష్యం. అందుకే ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా, ఎన్ని అవరోధాలు సృష్టిస్తున్నా మేము ధైర్యంగా ముందుకే సాగుతాము తప్ప వెనకడుగువేసే ప్రసక్తే లేదు,” అని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 


Related Post