జైట్లీ భలే విశ్లేషించారు!

November 22, 2017


img

గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో హార్దిక్ పటేల్ చేతులు కలపడాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చాలా చక్కగా విశ్లేషించారు. రాష్ట్రంలో పటేల్ కులస్తులకు ఉద్యోగాలలో కనీసం 10 శాతం రిజర్వేషన్లు కావాలని యువ నాయకుడు హార్దిక్ పటేల్ డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకొంది కనుక ఎన్నికలలో ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ఈరోజు ప్రకటించారు. 

అయితే గుజరాత్ లో ఇప్పటికే రిజర్వేషన్ల గరిష్ట కోట 50 శాతానికి చేరుకొంది. రాజ్యాంగం ప్రకారం 50 శాతం కంటే మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీం కోర్టు పదేపదే చెపుతోంది. కనుక గుజరాత్ లో ఇప్పుడున్నవాటికి అధనంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఎంతమాత్రం సాధ్యం కాదని, అయినా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఇస్తుందని హార్దిక్ పటేల్ ఇద్దరూ ప్రజలను మోసం చేస్తూ, మళ్ళీ వారు ఒకరినొకరు మోసం చేసుకొంటున్నారని అరుణ్ జైట్లీ ఎద్దేవా చేశారు. 

అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పటేల్ కులస్తులకు అధనంగా రిజర్వేషన్లు ఇవ్వ(లే)దని హార్దిక్ పటేల్ కు బాగా తెలుసునని, అతనికి తెలుసుననే విషయం కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసునని అరుణ్ జైట్లీ చెపుతున్నట్లు భావించవచ్చు. కనుక స్వప్రయోజనాల కోసమే వారు చేతులు కలిపి ఒకరినొకరు మోసం చేసుకొంటూ, ప్రజలను కూడా మోసం చేస్తున్నారని జైట్లీ అన్నట్లు భావించవచ్చు. 

అయితే హార్దిక్ పటేల్ తమను కాదని లేదా తమపై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపి, తమ పార్టీని ఎన్నికలలో దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నందుకు భాజపాకు అతనిపై ఆగ్రహం కలగడం సహజమే. ఒకవేళ అతను భాజపాతో చేతులు కలిపి ఉండి ఉంటే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అతనిని విమర్శిస్తూ ఉండేది. మరో రెండేళ్ళ వరకు రాజకీయాలలోకి రానని హార్దిక్ పటేల్ చెపుతున్నప్పటికీ, అయన రాజకీయ చతురత, వ్యూహాలు చూస్తే, రాజకీయాలలో అప్పుడే చాలా ఆరితేరిపోయినట్లు కనిపిస్తున్నారు. భాజపాకు కంచుకోటగా ఉన్న గుజరాత్ లో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోందని గుర్తించిన హార్దిక్ పటేల్, దాని అవసరాన్ని బాగానే గుర్తించి దానితో చేతులు కలిపి తన ఇమేజ్ బాగానే పెంచుకొన్నారని చెప్పక తప్పదు. 



Related Post