ట్రిపుల్ తలాఖ్ కు పార్లమెంటులో తలాక్

November 21, 2017


img

 భారతదేశంలో అనేక లక్షల మంది ముస్లిం మహిళల జీవితాలను చిద్రం చేస్తున్న ‘ట్రిపుల్ తలాక్’ విధానం రాజ్యాంగ విరుద్దమని ఆగస్ట్ 22వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దాని కోసం కేంద్రప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసేవరకు ఆరు నెలలపాటు ట్రిపుల్ తలాక్ విధానాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కనుక ఆ విధానాన్ని దేశంలో శాశ్వితంగా నిషేదించేందుకు త్వరలో మొదలవబోతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టడానికి మోడీ సర్కార్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిని రూపొందించేందుకు మంత్రివర్గ కమిటీని ఏర్పాటు కూడా చేసిందని తెలుస్తోంది. 

అయితే ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్రప్రభుత్వం, సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం తమ మత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని దేశంలో కొన్ని ముస్లిం మత సంస్థలు, మత గురువులు వాదిస్తున్నారు. తలాక్ విధానాన్ని నిషేధిస్తూ రూపొందించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసినట్లయితే, ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యను విడిచిపెట్టాలనుకొన్న పురుషులు చట్టప్రకారం శిక్షార్హులు అవుతారు. కనుక దేశంలో మిగిలిన పౌరుల మాదిరిగానే న్యాయస్థానాల ద్వారా విడాకులు పొందవలసి ఉంటుంది. అది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ కనుక చిన్న చిన్న కారణాలకు విడాకుల ఆలోచనలు చేయడం తగ్గుతుంది. తద్వారా ముస్లిం మహిళల జీవితాలకు ఇదివరకు కంటే భద్రత, భరోసా ఏర్పడుతుంది. ఇది ముస్లిం మతాచారాలలో జోక్యం చేసుకోవడమే అయినప్పటికీ, దేశంలో ప్రతీ ముస్లిం తల్లి, చెల్లి, కూతురు, ఆడపడుచుల జీవితాలకు భద్రత కల్పిస్తుంది కనుక విజ్ఞులైన ముస్లింలందరూ ఈ బిల్లుకు సహకరించడం చాలా అవసరమే. 


Related Post