దత్తన్నా ఇదేంది?

November 21, 2017


img

బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు, హైదరాబాద్ లో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం తెరాస సర్కార్ ఆయనను ఆహ్వానించేది కనుక అయన వాటిలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు పదవిలో లేకున్నా ఆయన హైదరాబాద్ లో తెరాస సర్కార్ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉన్నారు. ఇటీవల అయన మంత్రి కేటిఆర్ తో కలిసి గ్రేటర్ పరిధిలో జరిగిన కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. దానిపై రాష్ట్ర భాజపా నేతలు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో తాము తెరాస సర్కార్ పై శాసనసభ లోపల బయటా పోరాడుతుంటే, తమ పార్టీ ఎంపి వెళ్ళి తెరాస నేతలతో భుజాలు రాసుకొని తిరగడం వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని వారి వాదన. అయితే తాను ఇప్పుడు ఎంపి హోదాలో తన నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలలో పాల్గొంటున్నానని, దానిలో తప్పేమీ లేదని దత్తన్న మీడియాతో అన్నారు. ఎక్కడ తెరాసతో కలిసి పనిచేయాలో..ఎక్కడ పోరాడాలో తనకు బాగా తెలుసునని దత్తన్న అన్నారు. 

ఇప్పటికే తెరాసతో పొత్తుల కోసం భాజపా ఆరాటపడుతోందనే విమర్శలు, వచ్చే ఎన్నికలలో తెరాసతో కలిసి పనిచేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పుడు, భాజపాలో అందరి కంటే సీనియర్ నేత అయిన దత్తన్న ఏదో ఒక సాకుతో తెరాస నేతలు, మంత్రులతో రాసుకుపూసుకు తిరుగుతుంటే, మీడియాలో వస్తున్న ఆ వార్తలు, ఊహాగానాలు నిజమేననే అనుమానం ప్రజలకు కలగడం సహజం. అటువంటప్పుడు రాష్ట్ర భాజపా నేతలు తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పించడం, పోరాటాలు చేయడం అంతా భూటకమని, తమను మభ్యపెట్టడానికే వారు ఆవిధంగా నటిస్తున్నారని ప్రజలు భావిస్తే అప్పుడు నష్టపోయేది భాజపాయే కానీ తెరాస కాదు. ఈ విషయం అపార రాజకీయ అనుభవజ్ఞుడైన దత్తన్నకు తెలియదనుకోలేము. అయినా దత్తన్న తమ స్వంత పార్టీ నేతలతో కంటే తెరాస మంత్రులతోనే బాగా కలిసిపోగలుగుతున్నారు. అందుకే ఎక్కువ ఇష్టపడుతున్నట్లున్నారు. కనుక ఈ విషయంలో దత్తన్న పూర్తి క్లారిటీతోనే ఉన్నారని అర్ధం అవుతోంది. కనుక రాష్ట్ర భాజపా నేతలు ఏమి చేస్తారో చూడాలి.          



Related Post