జగపతిబాబు పాదయాత్ర...దేనికో?

November 21, 2017


img

రాజకీయ నాయకులు పాదయాత్రలు చేయడం సర్వసాధారణమైన విషయమే కానీ నటుడు జగపతిబాబు పాదయాత్ర చేయడమే విచిత్రం. చిన్న సినిమాలను అందరూ ప్రోత్సహించాలని కోరుతూ విజయవాడలో నిత్యం రద్దీగా ఉండే కాళేశ్వరం మార్కెట్ లో అయన నిన్న పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “మనకు అనేకమంది అందమైన నటీనటులున్నారు. రూ.2-3 కోట్ల బడ్జెట్ తో మంచి సినిమాలు తీయగల యువదర్శకులున్నారు. వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు ‘పెళ్లిచూపులు’ చిన్న సినిమాయే అయినా సూపర్ హిట్ అయ్యింది. చిన్న సినిమాలను ప్రోత్సహించడానికే ఈ చిన్న పాదయాత్ర. ఒక సినిమా హిట్ అయ్యిందా లేదా అనేది కలెక్షన్లలో ఉండదు. అది మన మనసులలో, మెదళ్లలో ఉండాలి. చిన్న సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారు తమ సినిమాలను ప్రదర్శించుకోవడానికి ధియేటర్లు దొరకడం లేదు. ఈ పరిస్థితి మారాలి,” అని అన్నారు జగపతిబాబు.

చిన్న సినిమాలను అందరూ ప్రోత్సహించాలని జగపతిబాబు కోరుకోవడం అభినందనీయమే. అయితే దానికోసం ఆయన రద్దీగా ఉండే మార్కెట్లో బౌన్సర్లను వెంటబెట్టుకొని పాదయాత్ర చేయడం ఏమిటో..ఎందుకో ఎవరికీ అర్ధం కాదు. ఒకవేళ ఆయనకు చిన్న సినిమాలను ప్రోత్సహించాలనుకొంటే ఆయన చిన్న సినిమాలలో కూడా నటించవచ్చు. లేదా రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని ధియేటర్లను తమ గుప్పెట్లో పెట్టుకొన్నఇండస్ట్రీలో ‘ఆ నలుగురు’ పెద్ద నిర్మాతలతో మాట్లాడి, చిన్న సినిమాలకు కూడా ధియేటర్లు ఇచ్చేలా వారిని ఒప్పించి ఉంటే ఏమైనా ప్రయోజనం ఉండేది. లేదా చిన్న సినిమాలు విడుదలైనప్పుడు, పెద్ద హీరోలు, దర్శకులు, కెసిఆర్, కేటిఆర్ వంటి రాజకీయనాయకులు స్వయంగా ఆ సినిమాలను చూసి వచ్చి వాటి గురించి నాలుగు మంచి ముక్కలు ఏవిధంగా మాట్లాడుతారో జగపతిబాబు కూడా ఆవిధంగా చేసినా చాలు.. చిన్న సినిమాలకు మహోపకారం చేసినవారవుతారు. కనీసం విడుదలైన చిన్న సినిమాలను  మెచ్చుకొంటూ వాటి గురించి సోషల్ మీడియాలో నాలుగు ముక్కలు వ్రాసి పెట్టినా వాటికి ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది. కానీ ఇవేమీ చేయకుండా తెలుగు సినిమాలలో విలన్ లాగ పంచె కట్టుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, బౌన్సర్లను వెంటబెట్టుకొని రద్దీగా ఉండే మార్కెట్లో అందరినీ పక్కకు తోసేస్తూ పాదయాత్ర చేయడం వలన ఏమి ప్రయోజనం? ఒకప్పుడు తాను తిరిగిన కాళేశ్వరం మార్కెట్ ను ఆయనకు చూడాలనిపిస్తే నిరభ్యంతరం చూడవచ్చు. ప్రజలకు, మీడియాకు అదే ముక్క చెపితే అందరూ సంతోషిస్తారు. కానీ చిన్న సినిమాలను ప్రమోట్ చేయడానికి పాదయాత్ర చేశానని చెపితేనే హాస్యాస్పదంగా ఉంది.  


Related Post