మోత్కుపల్లికి ఇన్నాళ్ళు వారి సమస్య గుర్తురాలేదా?

November 20, 2017


img

టిటిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు రైతు సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఒక్కరోజు నిరాహారదీక్ష చేశారు. ఈ సందర్భంగా అయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కెసిఆర్ మాయమాటలతో రైతులను మభ్యపెడుతూ కాలక్షేపం చేసేస్తున్నారు తప్ప రైతుల కోసం నిజంగా చేసిందేమీ లేదు. రైతుల రుణమాఫీ, ఆత్మహత్యలు చేసుకొన్న రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో తెరాస సర్కార్ రైతులను మోసం చేస్తోంది. తెలంగాణాలో టిటిడిపి పనైపోయిందని కెసిఆర్ చంకలు గుద్దుకొంటున్నారు. కానీ తెదేపాను బలహీనపరచడం ఎవరివల్ల సాధ్యం కాదు. వచ్చే ఎన్నికలలో తెలంగాణా ప్రజలు తెరాసకు, కెసిఆర్ కు తగినబుద్ధి చెప్పడం తధ్యం,” అని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. 

తెలంగాణా ఏర్పడిన కొత్తలో కరెంటు కొరత, ఆర్ధిక సమస్యలు, గిట్టుబాటు ధర లభించకపోవడం వంటి అనేక కారణాల చేత వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. నేటికీ అప్పుడప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. రైతుల సమస్యల గురించి టిటిడిపితో సహా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ గట్టిగానే పోరాడాయి. ఇంకా పోరాడుతూనే ఉన్నాయి. కానీ ఈ మూడున్నరేళ్ళలో గవర్నర్ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తూ మోత్కుపల్లి నరసింహులు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఈ మూడున్నరేళ్ళలో రాష్ట్రంలో రైతులతో సహా వివిధ వర్గాల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ మోత్కుపల్లి ఏనాడూ కనీసం నోరువిప్పి మాట్లాడలేదు.

మరోపక్క ఫిరాయింపుల కారణంగా తెలంగాణాలో తెదేపా మెలమెల్లగా బలహీనపడుతున్నా కూడా ఆయన చేతులు ముడుచుకొని చూస్తూనే ఉన్నారు తప్ప పార్టీని కాపాడుకొనేందుకు ప్రయత్నించలేదు. గవర్నర్ పదవిపై ఆశతో స్వంత పార్టీనే కాపాడుకోవడానికి ముందుకురాని వ్యక్తి ఇప్పుడు రైతుల సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నారంటే నమ్మగలామా? నిజానికి ఆయన పోరాటం రైతుల కోసం కాదు..మరొక ఏడాదిలోగా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కనుక ఇంకా గవర్నర్ పదవి కోసం ఎదురుచూస్తూ కూర్చొంటే రాజకీయంగా నష్టపోతాననే భయంతోనే మళ్ళీ తన ఉనికిని చాటుకొని నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకోనేందుకే అయన ఈ హడావుడి చేస్తున్నారని భావించవచ్చు. 

వచ్చే ఎన్నికలలో తెదేపా, తెరాస, భాజపాలు మూడు పొత్తులు పెట్టుకొంటే అందరికీ మంచిదని కొన్ని రోజుల క్రితమే అయన అన్నారు. కానీ ఇప్పుడు అదే తెరాసకు ప్రజలు బుద్ధి చెపుతారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణా టిటిడిపి భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంది కనుక అయన మరికొన్ని రోజులు వరకు తెదేపానే అంటిపెట్టుకొని ఉంటూ, రాజకీయంగా మళ్ళీ ఫుల్-ఛార్జ్ అయ్యేందుకు ఈవిధంగా ఏదో ఒక హడావుడి చేసి, తెరాస లేదా కాంగ్రెస్ పార్టీల దృష్టిని ఆకర్షించి వాటిలో దేనినుంచైనా మంచి ఆఫర్ వస్తే జంప్ చేసేసినా ఆశ్చర్యం లేదు. 


Related Post