పరిష్కార దిశలో అయోధ్య-బాబ్రీ సమస్య

November 20, 2017


img

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిరం-బాబ్రీ మసీదు సమస్య దశాబ్దాలుగా పుండులా సలుపూతూనే ఉంది. సున్నితమైన ఆ సమస్యను పరిష్కరించేందుకు తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయోధ్యలో రామ మందిరం, లక్నోలో మశీదు నిర్మించడానికి హిందూ సంస్థలు, షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ సూత్రప్రాయంగా ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. యూపి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయీద్ వసీం రిజ్వీ ఈ విషయం మీడియాకు తెలియజేశారు. 

సున్నితమైన ఈ సమస్యను కోర్టు వెలుపల ఇరు వర్గాలు చర్చించుకొని సామరస్యంగా   పరిష్కరించుకొని తగిన ప్రతిపాదనలతో రావలసిందిగా ఇదివరకు సుప్రీం కోర్టు సూచించింది. దాని సూచన మేరకే కోర్టు వెలుపల ఈ పరిష్కారం కనుగొ న్నామని, ఇది దేశంలో హిందూ, ముస్లింల సౌభ్రాతత్వానికి ఎంతో మేలు చేస్తుందని యూపి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయీద్ వసీం రిజ్వీ అన్నారు. కనుక తమ ప్రతిపాదనలను సుప్రీం కోర్టుకు తెలియజేసి, దీనిపై తీర్పు వెలువరించవలసిందిగా తమ పిటిషన్ లో కోరామని తెలిపారు. యూపిలో మీరట్ లో ఘంటాఘర్ అనే ప్రాంతంలో మశీదు నిర్మాణానికి అవసరమైనంత స్థలం ఇప్పించవలసిందిగా యూపి సర్కార్ ను ఆదేశించవలసిందిగా సుప్రీం కోర్టును కోరామని సయీద్ వసీం రిజ్వీ తెలిపారు. 

యూపిలో యోగి ఆదిత్యనాద్ సర్కార్ కూడా వీలైనంత త్వరగా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేయాలని ఆత్రంగా ఉంది కనుక వక్ఫ్ బోర్డ్ ప్రతిపాదనకు తక్షణమే సానుకూలంగా స్పందించడం ఖాయం. 

అయితే వక్ఫ్ బోర్డు చేస్తున్న లక్నోలో మశీదు నిర్మాణ ప్రతిపాదనకు దేశంలో ముస్లిం సంస్థలు, ముస్లిం మత గురువుల అంగీకారం, సహకారం కూడా చాలా అవసరం. అప్పుడే ఈ సమస్య శాశ్వితంగా పరిష్కారం కాగలదు. లేకుంటే మళ్ళీ మొదటికి రావచ్చు. 


Related Post