కాంగ్రెస్ చరిత్రలో కీలక ఘట్టం

November 20, 2017


img

కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టానికి నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శ్రీకారం చుట్టింది. ఈరోజు డిల్లీలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసింది. డిసెంబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి ఆరోజు నుంచి 4వ తేదీ వరకు నామినేషన్స్ స్వీకరిస్తారు. ఆ మరునాడు అంటే డిసెంబర్ 5వ తేదీ నామినేషన్స్ ఉపసంహరణకు గడువు. ఒకవేళ రాహుల్ గాంధీ కాకుండా వేరెవరైనా పార్టీ అధ్యక్ష పదవికి  నామినేషన్ వేసినట్లయితే, డిసెంబర్ 16న ఎన్నికలు నిర్వహించి 19వ తేదీన ఓట్లు కౌంటింగ్ చేసి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఎవరూ నామినేషన్ వేయనట్లయితే డిసెంబర్ 5వ తేదీన రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ప్రకటిస్తారు. 

కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు అనేకమంది అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వారిలో చాలా మంది ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. కానీ రాహుల్ గాంధీ విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో కొందరు సీనియర్ నేతలు ఆయన నాయకత్వలక్షణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటమే అందుకు కారణం. 

ఇంతవరకు పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ తరచూ అనారోగ్యం పాలవుతుండటం, 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటం కారణంగా పార్టీ నాయకత్వ మార్పు అనివార్యమైంది. కానీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని విజయపధంలో నడిపించగలరా...లేరా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పుడు ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్దం అవుతోంది. కనుక ఈ ఎన్నికలలో ఆయనపై పార్టీలో ఎవరైనా పోటీ చేస్తారా లేదా అనే విషయంపై డిసెంబర్ 4వ తేదీకి పూర్తి స్పష్టత వస్తుంది. ఒకవేళ ఎవరూ వ్యతిరేకించకపోతే అయన ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికవుతారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం సాధించగలిగితే పరువలేదు. లేకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్...దానిపై ఆధారపడిన వేలాదిమంది కాంగ్రెస్ నేతలు, లక్షలాది కార్యకర్తల భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. కనుక ఈ అధ్యక్ష ఎన్నికలు కాంగ్రెస్ చరిత్రలో అత్యంత కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. 

రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలని దేశవ్యాప్తంగా అనేకమంది కాంగ్రెస్ నేతలు కోరుకొంటున్నారు. అది సహజమే. కానీ వారితోబాటు భాజపా కూడా ఆయనే కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని కోరుకోవడం విశేషం. నాయకత్వ లక్షణాలు, రాజకీయ చతురత బొత్తిగా లేని ఆయన నేతృత్వంలో నడిచే కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికలలో ఓడించడం సులభం అని భాజపా భావిస్తోంది. 


Related Post