అది చూసి భ్రమలో పడొద్దు

November 18, 2017


img

భారత్ ఆర్ధిక, వాణిజ్య వ్యవస్థలు నిలకడగా ఉన్నాయని సూచిస్తూ అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ‘మూడీస్’ భారతదేశ సావరిన్ క్రెడిట్ రేటింగ్ ‌ను బిఎఎ-3 నుంచి బిఎఎ-2కు సవరించడంతో, నోట్లరద్దు, జి.ఎస్.టి.లపై విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మోడీ సర్కార్ కు చాలా ఊరట లభించినట్లయింది. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక, వాణిజ్య విధానాలు, ఆ రంగాలలో అమలుచేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని గట్టిగా చెప్పుకొనేందుకు ఈ రేటింగ్ చాలా ఉపయోగపడింది. 

దాదాపు 13 ఏళ్ళ తరువాత మళ్ళీ భారత్ కు అరుదైన ఈ రేటింగ్ లభించడంతో కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపక్షాలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం సరైన దిశలోనే సాగుతోందని తెలుసుకోవడానికి మూడీస్ ప్రకటించిన ఈ తాజా రేటింగే నిదర్శనమని అన్నారు. కనుక ఇకనైనా ప్రతిపక్షాలు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.

మూడీస్ ఇచ్చిన ఈ రేటింగ్, దానిపై కేంద్రం స్పందనలను చూసి మాజీ ఆర్ధికమంత్రి, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా స్పందించారు. మూడీస్ చేసిందేదో చేసింది. అది ఇచ్చిన ఈ రేటింగ్ చూసి భారత్ ఆర్ధిక సమస్యలలో నుంచి బయటపడిపోయిందనే భ్రమలో పడవద్దని, గల్ఫ్ లో ఏర్పడుతున్న సంక్షోభం కారణంగా త్వరలో క్రూడాయిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని, అది దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రమాదం ఉందని, కనుక మోడీ సర్కార్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇటువంటి ఆటుపోట్లను తట్టుకొనే విధంగా దేశ ఆర్ధికవ్యవస్థను బలంగా తీర్చిదిద్దడంపై మోడీ సర్కార్ దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం 8శాతం ఉన్న వృద్ధిరేటును 10 శాతానికి పెంచాలనుకొంటున్నట్లు మోడీ సర్కార్ చెపుతోందని, ఆ దిశగా ముందుకు సాగాలంటే దేశ ఆర్ధికవ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. 

ఒక గొప్ప ఆర్ధికవేత్తగా డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన, ప్రధానమంత్రిగా విఫలం అయినప్పటికీ, ఆయన చేసిన ఈ హెచ్చరికలను, సూచనలను మోడీ సర్కార్ సీరియస్ గా తీసుకోవడం అవసరమేనని చెప్పవచ్చు. 


Related Post