పద్మావతిపై అంత లొల్లి దేనికి?

November 18, 2017


img

రాణీ పద్మావతి జీవిత కధ ఆధారంగా దీపికా పడుకొనే ప్రధానపాత్రలో దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి 'పద్మావతి' అనే సినిమా తీశారు. డిసెంబర్త్వ 1న అది విడుదల కాబోతోంది. కానీ దానిలో రాజ్ పుట్ ల చరిత్రను వక్రీకరించి, వారికి ఎంతో గౌరవనీయురాలైన ‘రాణీ పద్మావతి’ పాత్రను తక్కువచేసి చూపించారని ఆరోపిస్తూ కొన్ని హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఆ సినిమాతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కనుక దానిని విడుదలకాకుండా నిలిపివేయాలని లేకుంటే విద్వంసం తప్పదని హెచ్చరిస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్నాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలలో వారి హడావుడి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. 

అయితే ఆందోళనకారులలో ఎంతమందికి అసలు ‘రాణీ పద్మావతి’ పేరు విన్నారు? ఎంతమందికి ఆమె పుట్టుపూర్వోత్తరాలు, ఆనాటి చరిత్ర గురించి తెలుసు? అని ప్రశ్నిస్తే సమాధానం దొరకడం కష్టమే. కనీసం ఆమె పేరు, చరిత్ర తెలియని వారందరూ ‘మనోభావాలు దెబ్బతిన్నాయంటూ’ ఆ సినిమాకు వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇంతవరకు ఆ సినిమా విడుదలకానప్పుడు దానిలో చరిత్రను వక్రీకరించారని, రాణీ పద్మావతి పాత్రను తక్కువ చేసి చూపారని ఏవిధంగా నిర్ధారించగలరు? ఎవరు నిర్ధారించారు? అనే ప్రశ్నలకు ఆందోళనకారుల వెనుక ఉన్న పెద్దలు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. 

ఇంతవరకు రామాయణ, మహాభారత, భాగవత కధలు, పురాణాల ఆధారంగా అనేక పౌరాణిక సినిమాలు వచ్చాయి. వాటిలో ఎవరికి తోచినవిధంగా వారు కధలు వ్రాసుకొని సినిమాలు తీశారు. ఇక తెలుగులో శ్రీకృష్ణుడు, హనుమంతుడు, వినాయకుడు, యమధర్మరాజు, నారదుడు వంటి పాత్రలను చాలా వెకిలిగా చూపించిన సినిమాలు కోకొల్లలు వచ్చాయి. అలాగే ద్రౌపదీ వస్త్రాపహరణం వంటి సున్నితమైన అంశాలపై కూడా మనసులు నొచ్చుకొనేవిధంగా సినిమాలు, నాటకాలు వచ్చాయి. 

ఇక సృజనాత్మకత పేరుతో గణేష్ ఉత్సవాలలో వినాయకుని విగ్రహాన్ని చాలా అవమానకరమైన రూపాల్లో తయారుచేస్తుంటారు. ఈవిధంగా అడుగడుగునా హిందూ దేవుళ్ళు, పురాణాలను నవ్వులపాలు చేస్తున్నప్పుడు దెబ్బ తినని మనోభావాలు, ఇప్పుడే ఎందుకు దెబ్బ తింటున్నాయి? ఈ ఆందోళనలకు గుజరాత్ ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. ఉన్నట్లయితే గుజరాత్ లో డిశంబర్ 9, 14 వ తేదీలలో పోలింగ్ ముగిసేవరకు ఈ హడావుడి కొనసాగవచ్చు. బిహార్ ఎన్నికల సమయంలో ‘గోవధ’ అంశం హైలట్ అయ్యి, పోలింగ్ ముగియగానే చల్లారిపోయినట్లే, ఒకవేళ దీనికీ గుజరాత్ ఎన్నికలకు సంబంధం ఉన్నట్లయితే, పోలింగ్ పూర్తి కాగానే బహుశః పద్మావతి సినిమాపై హడావుడి తగ్గుతుందేమో? ఏమైనప్పటికీ సినిమా విడుదల కాకముందే దానిని జడ్జ్ చేసేసి మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ఆందోళనలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 


Related Post