తెలంగాణాలో ఎర్రజెండా సాధ్యమేనా?

November 18, 2017


img

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. రాష్ట్రంలో సుస్థిరమైన, ప్రజా ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ మూడున్నరేళ్ళలో అన్ని రంగాలలో అనేక సంస్కరణలు అమలయ్యాయి. వాటికి మంచి ఫలితాలు, సర్వత్రా ప్రశంశలు కూడా లభిస్తున్నాయి. కనుక మళ్ళీ తమకే ప్రజలు పట్టం కట్టడం ఖాయమని తెరాస బల్లగుద్ది గట్టిగా వాదిస్తోంది. 

మరోపక్క ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, నిరంకుశపాలన సాగుతోందని, ప్రభుత్వ చేపట్టిన అన్ని పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలలో బారీగా అవినీతి జరుగుతోందని, రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు వివిధ వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి కెసిఆర్ మాయమాటలతో మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని, కనుక వచ్చే ఎన్నికలలో తెరాసను గద్దె దించక తప్పదని’ ప్రతిపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి. 

తెలంగాణా రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, గద్దర్, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, చుక్కా రామయ్య  వంటి కొందరు మేధావులు, కొన్ని ప్రజాసంఘాలు, కులసంఘాలు కూడా తెరాస సర్కార్ అప్రజాస్వామిక, నిరంకుశ పోకడలను గట్టిగా నిరసిస్తున్నాయి. 

ప్రస్తుతం రాష్ట్రంలో అధికార తెరాస, ప్రతిపక్షాలలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బలంగా కనిపిస్తున్నాయి. కనుక ఆ రెంటికీ ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి వామపక్షాలు సన్నాహాలు మొదలుపెట్టాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, తెరాస, భాజపాలను వ్యతిరేకించే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను, మేధావులను కలుపుకొని ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని అవి భావిస్తున్నాయి.   

రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంలో వామపక్షాలు ఎప్పుడూ ముందుంటాయనేది వాస్తవం. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలు వాటి పోరాటాలలో తప్పకుండా పాల్గొంటున్నప్పటికీ, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం వారందరూ ప్రధాన పార్టీలకే ఓట్లు వేస్తుంటారు. దేశంలో చాలా మంది ప్రజలు వామపక్షాల భావజాలాన్ని అంగీకరించినట్లు కనబడదు. ఇక అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించి, ప్రజలపై కుల,మత,వర్గ, ప్రాంతాలు, సెంటిమెంట్లు, ప్రలోభాలకు గురిచేసి ఓట్లు రాబట్టుకొంటుంటాయనే అందరికీ తెలిసిన రహస్యం వామపక్ష నేతలు, మేధావులకు తెలియదనుకోలేము. 

తెలంగాణాలో బలంగా ఉన్న కాంగ్రెస్, తెరాసలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించాలనుకోవడం సులువే కానీ ఇటువంటి వ్యవహార శైలితో, ఇటువంటి ఎన్నికల నేపధ్యంలో వామపక్షాలు కాంగ్రెస్, తెరాసలను ఓడించడం సాధ్యమేనా? 


Related Post