సమన్వయ సమితులకు ఆదిలోనే సమస్యలు

November 18, 2017


img

తెరాస సర్కార్ ఆర్భాటంగా మొదలుపెట్టిన తెలంగాణా రైతు సమన్వయసమితుల ఏర్పాటు ప్రక్రియకు అడుగడుగునా అనేక సమస్యలు, సందేహాలు ఎదురవుతుండటంతో ఇంతవరకు అవి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేకపోయాయి. మొదట వాటి ఏర్పాటును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. న్యాయస్థానంలో సవాలు కూడా చేశాయి. ఆ అవరోధాల కారణంగా వాటికి చట్టబద్దత కల్పించవలసిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. వాటినన్నిటినీ కలిపి కార్పోరేషన్ గా ఏర్పాటు చేస్తూ ఈ శీతాకాల శాసనసభ సమావేశాలలో బిల్లు పెట్టబోతోందని వార్తలు వచ్చినప్పటికీ ప్రభుత్వం అటువంటి ప్రయత్నమేదీ చేయలేదు. 

అయితే వచ్చే ఏడాది నుంచి వాటి ద్వారానే రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తుండటం చేత, దానికి ప్రభుత్వం లేదా బ్యాంకుల ద్వారా మూలధనం సమకూర్చవలసి ఉంటుంది. కనుక వాటికి చట్టబద్దత కల్పించడం అనివార్యం అవుతోంది. అయితే ఈ రంగంలో మంచి అనుభవం కలిగి, చట్టబద్దత ఉన్న ప్రభుత్వ సంస్థ తెలంగాణా రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య (మార్క్ ఫెడ్) ఆ ప్రయత్నంలో ఇప్పటికే చేతులు కాల్చుకొంది.  అదే రూ.50 కోట్లు నష్టపోయింది మరి ఇప్పుడు ఎటువంటి అనుభవమూ లేని తెలంగాణా రైతు సమన్వయసమితులకు ఆ బాధ్యతలు అప్పగిస్తే, అవి విజయవంతంగా నిర్వహించగలవా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అటువంటప్పుడు బ్యాంకులు వాటికి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. 

ఇంతవరకు గ్రామ, మండల స్థాయిలో తెలంగాణా రైతు సమన్వయసమితిలు ఏర్పాటయినప్పటికీ జిల్లా, రాష్ట్ర స్థాయి సమితుల ఏర్పాటు కాలేదు. వాటిలో గ్రామ, మండల స్థాయిలో వారినే సభ్యులుగా తీసుకోవాలా లేక తెరాసలో రాజకీయ నిరుద్యోగులకు వీటిలో స్థానం కల్పించడం మంచిదా లేదా బ్యాంకు రుణాలు, మార్కెట్ ధరలు, వంటి రంగాలలో నిపుణులైన వారిని తీసుకొంటే మంచిదా అనే ఆలోచనలు సాగుతున్నాయి. ఈ సందేహాలు...ఆలోచనల మద్యే అప్పుడే మూడు నెలలు గడిచిపోయాయి. కనుక తెలంగాణా రైతు సమన్వయసమితులు ఏవిధంగా  ఏర్పాటవుతాయో..వాటి విధివిధానాలు ఏవిధంగా ఉంటాయో..అవి ఎప్పటి నుంచి పనిచేయడం మొదలుపెడతాయో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.   



Related Post