ఇవేం లెక్కలు...మీకెక్కడిది ఆ అధికారం?

November 18, 2017


img

నిన్నటితో శాసనసభ, మండలి సమావేశాలు ముగిసి ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. అనంతరం తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మీడియా పాయింట్ లో మాట్లాడుతూ తెరాస సర్కార్, స్పీకర్ మధుసూదనాచారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికీ తెదేపా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారికి తెరాస కండువాలు కప్పి వారందరూ తెరాసలో విలీనం అయిపోయినట్లు చూపించడం, తెదేపాలో కేవలం ముగ్గురే సభ్యులు ఉన్నట్లుగా చూపించడాన్ని వీరయ్య తప్పుపట్టారు. పార్టీ ఫిరాయించినవారిపై చర్యలు తీసుకోవడానికి మాత్రమే స్పీకర్ కు విచక్షణాధికారాలు ఉంటాయి తప్ప ఇతర పార్టీల సభ్యులను విలీనం చేయడానికి అధికారం ఉండదని అన్నారు. ఆ అధికారం కేవలం సదరు పార్టీకి లేదా ఎన్నికల సంఘానికి మాత్రమే ఉంటుందని అన్నారు.  

కాంగ్రెస్, సిపిఐ పార్టీల సభ్యులకు తెరాస కండువాలు కప్పి వారిని తెరాస సభ్యుల పక్కన స్థానాలు కేటాయించడాన్ని వీరయ్య తప్పు పట్టారు. ఒకవైపు సభలో వారిని తెరాస సభ్యులుగా చూపిస్తూనే మళ్ళీ మరోవైపు అసెంబ్లీ లెక్కలో మాత్రం వారిని కాంగ్రెస్, సిపిఐ సభ్యులుగా ఎందుకు చూపిస్తున్నారని వీరయ్య ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తాము హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరిగినప్పుడు, దీనిపై స్పందించడానికి మరింత సమయం కావాలని ప్రభుత్వం కోరిందని, కానీ నెలలు గడుస్తున్నా న్యాయస్థానానికి ఎందుకు వివరణ ఇవ్వడం లేదని వీరయ్య ప్రశ్నించారు. స్పీకర్ మధుసూదనాచారి చాలా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, తనకు లేని అధికారాలను సంక్రమింపజేసుకొని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తెరాస సభ్యులుగా అనుమతిస్తూ చట్టన్ని అతిక్రమిస్తున్నారని వీరయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వాదన సహేతుకంగానే ఉందని అర్ధం అవుతోంది. ఈ సమస్యపై ఆయన వాదన సంగతిని పక్కనబెడితే, ఇంతకాలం రేవంత్ రెడ్డి కారణంగా తెర వెనుక ఉండిపోయిన సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ నిష్క్రమణ తరువాత మీడియా ముందుకు వచ్చి బాగానే మాట్లాడుతున్నారని చెప్పవచ్చు. ఆయన్ జోరు చూస్తుంటే టిటిడిపిలో రేవంత్ రెడ్డి స్థానాన్ని అయన భర్తీ చేయబోతున్నారా.. అని అనిపిస్తోంది.     



Related Post