ఆ కేసులో ఉదాసీనత..ప్రజలకు తప్పుడు సంకేతాలు?

November 17, 2017


img

నిజామాబాద్ జిల్లాలో నవీపేట మండలంలో అభంగపట్నంలో భాజపా నేత భరత్ రెడ్డి గ్రామంలో ఇద్దరు దళితుల పట్ల చాలా అనుచితంగా వ్యవహరించినట్లు వీడియో బయటకు వచ్చి వారం రోజులు అయినప్పటికీ, ఇంతవరకు పోలీసులు అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవీపేట మండల కేంద్రంలో శుక్రవారం దళితసంఘాలు భరత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించాయి. అనంతరం దానిని దగ్ధం చేశారు. పోలీసులు భరత్ రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే, తమ ఆందోళనలు తీవ్రతరం చేస్తామని దళితసంఘాల నేతలు హెచ్చరించారు. మండలంలో ఉద్రిక్తవాతావరణం నెలకొనడంతో నిజామాబాద్ కమీషనర్ కార్తికేయ మిశ్రా, ఎసిపి సుదర్శన్ ఈరోజు అభంగపట్నంకు వచ్చి బాధితులైన లక్ష్మణ్, రాజేశ్వర్ లతో మాట్లాడి ఆ రోజు జరిగిన సంఘటన వివరాలు తెలుసుకొన్నారు. కానీ ఇప్పటికీ పోలీసులు భరత్ రెడ్డిపై కేసు నమోదు చేయకపోవడంతో దళితసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంలో భరత్ రెడ్డి తప్పు చేసినట్లు వీడియో రూపంలో స్పష్టమైన ఆధారాలున్నాయి. అయినా పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. భరత్ రెడ్డి భాజపాకు చెందిన వ్యక్తి కనుక వారు తొందరపడటం లేదని భావించవచ్చు. అయితే అతనితో తమ పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని భాజపా ప్రకటించిన తరువాత కూడా పోలీసులు అతనిపై కేసు నమోదు చేయకపోవడంతో, దళితుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపిస్తున్నట్లవుతోంది. 

ఇదివరకు నేరెళ్ళ ఘటన జరిగినప్పుడు కూడా తెరాస సర్కార్ ఇదేవిధంగా ఆలస్యంగా స్పందించి విమర్శలపాలైంది. భరత్ రెడ్డి వ్యవహారంలో కనబరుస్తున్న ఉదాసీనత కారణంగా దళితులపట్ల ప్రభుత్వానికి చిన్నచూపు ఉందనే భావన ప్రజలకు కలిగే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ నేతలు దీనిపై దృష్టి సారించి హడావుడి చేస్తే మళ్ళీ ప్రభుత్వమే అప్రదిష్టపాలుతుంది. కనుక ఈ వ్యవహారంలో ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవడం మంచిది. లేకుంటే భాజపా నేత చేసిన తప్పుకు తెరాస మూల్యం చెల్లించవలసిరావచ్చు.  


Related Post