వడ్డించేవాడు మనవాడైతే...

November 17, 2017


img

‘వడ్డించేవాడు మనవాడైతే...వరుసలో ఎక్కడ కూర్చొన్నా అడగకుండానే అన్నీ విస్తట్లో పడుతుంటాయి’ అనే నానుడి ఉంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విషయంలో అదే నిరూపించబడింది. ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో దోస్తీ చేసి, ఎన్డీయే కూటమిలో చేరడంతో ఆయన అడగకుండానే ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసినవన్నీ వచ్చి పడుతున్నాయి. అభివృద్ధి పనులు చకచకా జరిగిపోతున్నాయి. 

అయితే ఆయన మోడీతో చేతులు కలపడం ఇష్టపడని వారి పార్టీ (జెడియు) అధ్యక్షుడు శరద్ పవార్, నితీష్ వర్గాన్ని పక్కనబెట్టి తమదే అసలైన జెడియు అని, ఎన్నికల చిహ్నం ‘బాణం గుర్తు’ తమకే దక్కుతుందని వాదిస్తున్నారు. శ్రీకృష్ణుడు అంతటివాడు అర్జునుడి రధసారధిగా ఉండగా పాండవులను జయిద్దామని ప్రయత్నించి దుర్యోధనాధులు భంగపడినట్లే, జెడియు అధినేత శరద్ యాదవ్ కూడా వాస్తవిక దృక్పధంతో ఆలోచించకుండా మోడీ సారధ్యంలో నడుస్తున్న నితీష్ కుమార్ తో తలపడ్డారు. ఊహించినట్లుగానే జెడియు ఎన్నికల చిహ్నమైన ‘బాణం గుర్తు’ నితీష్ కుమార్ వర్గానికే దక్కుతుందని ఎన్నికల కమీషన్ ఈరోజు ప్రకటించింది. పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు, పార్టీ జాతీయ కార్యవర్గం కూడా నితీష్ కుమార్ పక్షానే ఉన్నందున అయన ప్రాతినిధ్యం వహిస్తున్న జెడియు పార్టీకే ఎన్నికల చిహ్నం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. 

తమిళనాడులో కూడా ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి కానీ అక్కడ భాజపా నిలద్రొక్కుకోవడానికి ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రి పన్నీరు సెల్వం ఇద్దరూ సహకరించడం లేదు. అందుకే కేంద్రం కూడా వారిపట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదనుకోవలసి ఉంటుంది.


Related Post