ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతిస్తే...

November 17, 2017


img

ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణిలో మరో ఆరు కొత్త బొగ్గుగనులను ప్రారంభించబోతున్నట్లు ఈరోజు శాసనసభలో ప్రకటించారు. వాటిలో మూడు ఓపెన్ కాస్ట్, మూడు భూగర్భ గనులు ఉంటాయని తెలిపారు. భూగర్భ గనుల విషయంలో ఎవరూ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయనప్పటికీ, ఓపెన్ కాస్ట్ గనుల పట్ల మాత్రం స్థానిక ప్రజలతో సహా ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ గనులున్న ప్రదేశంతో బాటు దాని చుట్టుపక్కలున్న ప్రాంతాలలో పంటలు, పంట భూములు, త్రాగునీరు, సాగునీరు, చెట్లు, గ్రామాలు అన్నీ విద్వంసానికి గురవుతుంటాయి. అందుకే వాటిపట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతుంటుంది.  

అయితే భూగర్భ గనులతో పోలిస్తే ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు త్రవ్వకాలు సాగించడం తేలిక. పైగా తక్కువ ఖర్చు, తక్కువ మానవ వనరులతో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. భూగర్భ గనులలో 61 శాతం కార్మికులు కష్టపడితే 17 శాతం బొగ్గు నిక్షేపాలు వెలికితీయవచ్చు. అదే ఓపెన్‌ కాస్ట్‌ గనులలో అయితే కేవలం 18 శాతం కార్మికులతో 82 శాతం బొగ్గు నిక్షేపాలను వెలికితీయవచ్చు. అందుకే ఏ ప్రభుత్వమైనా వీటికే మొగ్గుచూపుతుంటాయి. అయితే తెలంగాణా ప్రభుత్వం లాభాలు ఆర్జించాలనే ఉద్దేశ్యంతో కాక, కొత్తగా ఉద్యోగాల కల్పన, భూగర్బ గనుల త్రవ్వకాలకు అయ్యే అధనపు ఆర్ధికభారాన్ని, దానిలో వచ్చే నష్టాలను బ్యాలెన్స్ చేసుకోవడానికే ఓపెన్ కాస్ట్ గనులకు మొగ్గు చూపుతోంది. 

అదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న ఓపెన్ కాస్ట్ గనుల వలన ఇప్పటికే అక్కడ చాలా పర్యావరణ విద్వంసం జరిగింది. కనుక కొత్తగా మళ్ళీ మరో మూడు ఓపెన్ కాస్ట్ గనులను ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.  


Related Post