అంబానీలు ధనవంతులే..కానీ ఎవరికి లాభం?

November 17, 2017


img

ఏటా ప్రపంచంలో, వివిధ ఖండాలలో అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ పత్రిక ప్రకటిస్తుంటుంది. ఈసారి ప్రకటించిన జాబితాలో ముఖేష్ అంబానీ రూ.1.25 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలువగా, భారత్ లో అయన తరువాత హిందుజాలు, మిత్తల్, మిస్త్రీ, బిర్లాలు, గోద్రెజ్, బజాజ్, జిందాల్, బర్మన్, వాడియా మొదలైనవారు తరువాత స్థానాలలో నిలిచారు. 

భారతీయులు ఇంత సంపద సృష్టిచడం చాలా గర్వించదగ్గ విషయమే. వారు స్థాపించిన సంస్థల ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వారి సంస్థల నుంచి ప్రభుత్వానికి ఏటా కొన్ని వేల కోట్లు పన్నుల రూపేణా అందుతున్నాయి. వ్యాపార, పారిశ్రామిక రంగంలో వారు సాధించిన విజయాల కారణంగా దేశవిదేశాలలోను భారత్ గర్వంగా తలెత్తుకొని తిరుగగలుగుతోంది. 

ఇవన్నీ నాణేనికి ఒకవైపు. మరొకవైపు చూసినట్లయితే, దేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉండగా వారిలో కనీసం సగం మంది రెండు పూటలా తిండికి కూడా నోచుకోని దయనీయమైన పరిస్థితిలో ఉండగా, మరోవైపు ఇన్ని లక్షలు, వేలు కోట్ల సంపద ఆ కొద్ది మంది దగ్గరే పోగుపడిపోయి అది క్రమంగా పెరుగుతోందని అర్ధం అవుతోంది. 

పెరుగుతున్న వారి సంపదను చూసి సగటు భారతీయుడు కూడా సంతోషపడుతుంటాడు. ముఖేష్ అంబానీ 4-500 వందల కోట్లు ఖర్చు పెట్టి ముంబైలో 27అంతస్తుల విలాసవంతమైన భవనం కట్టుకొంటే, అదేదో తన కోసమే అంబానీ కట్టించారన్నట్లుగా సగటు భారతీయుడు సంతోష పడుతుంటాడు. అంబానీలు ‘స్వచ్చ భారత్’ పధకంలో భాగంగా ఎప్పుడైనా చీపురు పట్టుకొని కెమెరాలకు ఫోజులిచ్చినా సంతోషపడతారు అల్పసంతోషులైన భారతీయులు. 

అమెరికా, యూరప్ దేశాలలో అంబానీలకంటే పదిరెట్లు ఎక్కువ సంపాదించిన బిలియనీర్లు అనేకమంది, ఎప్పటికప్పుడు తమ ఆస్తులలో 80-90 శాతం వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ స్వచ్చంద సంస్థలకు దానం చేస్తుంటారు. తమ దేశాలలో చాలా బారీ స్థాయిలో సమాజ సేవాకార్యక్రమాలకు బారీగా విరాళాలు అందిస్తుంటారు. వారు స్వయంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కానీ అదే..మన దేశంలో అంబానీ వంటి సంపన్నులు తమ సంపదలో కనీసం 1-2 శాతం అయినా తిరిగి సమాజం కోసం ఖర్చు పెట్టడానికి వెనకాడుతుంటారు. ఎందుకు? వారు దేశం కోసం, దేశంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం ఏమి చేస్తున్నారు? అంటే సంతృప్తికరమైన సమాధానం ఉండదు. ఒకవేళ వారు చేస్తున్నా వారి సంపదల స్థాయికి అది ఏమాత్రం సరిపోదని చెప్పకతప్పదు.    

పైగా అంబానీలతో సహా ఈ ధనిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు అందరూ కూడా తమ పరిశ్రమలు, వ్యాపారాల కోసం బ్యాంకుల నుంచి లక్షల కోట్లు రుణాలు తీసుకొంటుంటారు. కానీ వారిలో ఎంత మంది సకాలంలో వడ్డీలతో తిరిగి చెల్లిస్తారో ఎవరికీ తెలియదు. విజయ్ మాల్యా వంటి ఆర్దికనేరగాడు బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోతే, అతని నుంచి ఆ సొమ్మును రాబట్టుకోలేక, ఆ భారాన్ని సామాన్యప్రజలపైకి బదిలీ చేస్తున్నాయి మన బ్యాంకులు. అంబానీలతో సహా దేశంలో కార్పోరేట్ సంస్థలు బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలు గత ఏడాది సమారు మూడు లక్షల కోట్లకు పైనే ఉన్నాయని వార్తలు వచ్చాయి. అంబానీల వద్ద ఇంత సంపద పోగుపడి ఉన్నప్పుడు, మళ్ళీ బ్యాంకుల వద్ద నుంచి ఎందుకు రుణాలు తీసుకొంటున్నారు? తీసుకొన్నా సకాలంలో వాటిని ఎందుకు చెల్లించడం లేదు? అనే ప్రశ్నిస్తే అదేమి పిచ్చి ప్రశ్న అని కొట్టిపారేస్తారు.  

ఇక జియో పేరుతో ఉచిత అపరిమిత టెలీసేవలు సామాన్యప్రజల అందుబాటులోకి తెచ్చిన ఘనత ఖచ్చితంగా ముఖేష్ అంబానీదే. అయితే జియో కారణంగా ఈ ఏడాదిన్నర వ్యవధిలోనే ఇతర టెలీకాం సంస్థలలో సుమారు 70,000 మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని మొన్ననే వార్తలలో చదువుకొన్నాము. మున్ముందు ఇంకా అనేక వేలమంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని టెలికాం రంగంలో నిపుణులు చెపుతున్నారు. అంటే జియో వ్యాపారాభివృద్ధికి అనేక వేలమంది మూల్యం చెల్లించుతున్నారన్నమాట. ఇదేనా...మన దేశ సంపన్న కార్పోరేట్ సంస్థలు దేశానికి చేస్తున్న ప్రత్యుపకారం? మరి వారు ఎంత సంపద పోగేసుకొంటే మాత్రం దేశానికి..సామాన్యుడికి ఏమి ఒరుగుతోంది? వారికి ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానం లభిస్తే అది చూసి సామాన్యులు ఎందుకు సంతోషపడాలి?                           



Related Post