శ్రీ వికె సింగ్ గారి ఇంటర్వ్యూ (చివరి భాగం)

November 16, 2017


img

 అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస తెలంగాణావాసులు ‘డయల్ యువర్ విలేజ్’ పేరిట ప్రతీవారం రాష్ట్రంలో వివిధ రంగాలలో ప్రముఖులతో మాట్లాడి తెలంగాణా రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం రాష్ట్ర జైళ్ళ శాఖ డైరెక్టర్ శ్రీ వికె సింగ్ గారితో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ మూడవ మరియు చివరి భాగం వివరాలు: 

గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలే భాగస్వాములుగా సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనుకొంటున్నట్లు వికె సింగ్ చెప్పారు. 

“సిటిజన్స్ ఫోరం కమిటీల ఏర్పాటు చేయాలంటే మొదట మా ఆశయాలు, లక్ష్యాలు, మేము పనిచేసే విధానాల గురించి ప్రజలకు వివరించడం, వారిని గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలలో చేర్చుకోవడం, వారు మేము అనుకొన్నవిధంగా ముందుకుసాగేలా చేయడం వంటివన్నీ కూడా కష్టమైన పనులే. కనుక ఒక్కో అడుగు చాలా మెల్లగా పడుతోంది. మా ప్రయత్నాలు ఫలించడానికి చాలా సమయం పట్టవచ్చు కానీ అంతమాత్రన్న మా ప్రయత్నాలు నిలిపివేయాలనుకోవడం లేదు.” 

మొదట మండల, జిల్లా స్థాయిలో సిటిజన్ ఫోరం కమిటీలను ఏర్పాటు చేసుకోగలిగితే వారితో గ్రామస్థాయిలో వారిని ఒప్పించి కమిటీలు ఏర్పాటు చేయవచ్చునని భావిస్తున్నాము. కనుక మా మొదటి లక్ష్యం జిల్లా, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కమిటీలు ఏర్పడితే వారిలో ఒకరిద్దరు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేవారుంటారు. కనుక వారే తమ స్థాయిలో సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలో నిర్ణయించుకొని అందరినీ ముందుండి నడిపిస్తుంటారని వికె సింగ్ చెప్పారు.

 సిటిజన్స్ ఫోరంకు ప్రభుత్వంతో కానీ దాని వ్యవస్థలతో గానీ ఘర్షణ పడే ఉద్దేశ్యం లేదని తెలిపారు. ఒకవేళ అటువంటి ఆలోచనలు చేస్తే ఆదిలోనే అందరూ కలిసి అణచివేస్తారని అన్నారు. అలాగే దీనిని చట్టబద్ద సంస్థగా రూపొందిస్తే, అప్పుడు ప్రజలు, పార్టీలు కూడా తమను మరో సంస్థగా లేదా పోటీదారుగానే చూస్తారు తప్ప దాని కార్యక్రమాలలో భాగస్వాములు కావడానికి ఇష్టపడకపోవచ్చని అన్నారు. పైగా చట్టబద్ద సంస్థ ఏర్పాటు చేయగానే అది సంస్థ ఆశయాలు, లక్ష్యాల కంటే ఎక్కువగా ఇతర విషయాలపై దృష్టి పెట్టవలసి వస్తుందని, అందుకే దీనిని ప్రజల భాగస్వామ్యంతో ఒక ఉద్యమరూపంలో ముందుకు నడిపిస్తున్నామని వికె సింగ్ తెలిపారు. సిటిజన్స్ ఫోరం కేవలం స్థానిక సమస్యల పరిష్కారానికి మాత్రమే కృషి చేస్తుందని తెలిపారు.

ఇక ప్రభుత్వంలోని ఉద్యోగులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండటం లేదనే ప్రశ్నకు జవాబుగా, “ఏదైనా ఒక వ్యవస్థలో పనిచేస్తున్నవారికి తాము తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే శిక్ష ఎదుర్కోవలసి వస్తుందనే భయం ఉంటుంది. అయితే ప్రజలెన్నడూ వారిని ప్రశ్నించే సాహసం చేయరు కనుక ఆవిధంగా వ్యవహరిస్తుండటం అలవాటుగా మారిపోతుంది. అయితే ఒక్క వ్యక్తి నిలదీసి అడిగినా వారిలో చలనం కలుగకపోవచ్చు. కానీ అదే కొంతమంది ప్రజలు కలిసి వెళ్ళి నిలదీస్తే తప్పకుండా పనులు జరుగుతాయి. అప్పటికీ ఫలితం కనబడకపోతే వారి పై అధికారులకు పిర్యాదు చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇదే మా సిటిజన్స్ ఫోరం అనుసరిస్తున్న ప్రాధమిక సూత్రం అని వికె సింగ్ తెలిపారు. 

గతంలో మెదక్ జిల్లాలో తాను పనిచేస్తున్నప్పుడు ఇటువంటి ఫోరం ఒకటి ఏర్పాటు చేయగా అది మంచి ఫలితాలను ఇచ్చిందని, ఆ స్పూర్తితోనే సిటిజన్స్ ఫోరంను నిర్మిస్తున్నానని చెప్పారు. తను ఉద్యోగరీత్యా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పని ఉండి వెళితే, కొంత సమయం కేటాయించి ఆ ప్రాంతంలో సిటిజన్ ఫోరం ఏర్పాటుకు కృషి చేస్తుంటానని చెప్పారు. ఇది ప్రజల భాగస్వామ్యంతో సమస్యల పరిష్కారం కోసం ఒక ఉద్యమ రూపంగా నడుస్తోంది కనుక దీనికి న్యాయపరమైన, చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదని అన్నారు.

తెలంగాణా రాష్ట్రం కోసం కొంత సమయం వెచ్చించాలనుకొంటున్నవారు యావత్ రాష్ట్ర సమస్యల కోసం పోరాడనవసరం లేదని ముందుగా తమ గ్రామాలు, మండలాలు, జిల్లాలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిజాయితీగా కృషి చేస్తే సరిపోతుందని అన్నారు. 

ప్రజల, పార్టీల, ప్రభుత్వ వ్యవస్థలలో అధికారులు, ఉద్యోగుల ఆలోచనలలో మార్పు తీసుకురావడం ఒక్కరోజులో సాధ్యం కాదు కనుక మెల్లగా ఆ దిశలో ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నామని వికె సింగ్ చెప్పారు. గత రెండేళ్ళలో రాష్ట్ర జైళ్ళ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టి మంచి ఫలితాలు రాబట్టగలిగినప్పుడు, అదే ప్రయోగం రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి చేసినట్లయితే ఊహించని అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నానని వికె సింగ్ చెప్పారు.   

వికె సింగ్ గారి స్వరాష్ట్రం బిహార్ అయినప్పటికీ తను సేవ చేస్తున్న తెలంగాణా రాష్ట్రాన్నే తన స్వంత రాష్ట్రంగా భావించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. మరి తెలంగాణాలో పుట్టిపెరిగిన మనం ఇంకెంత చేయాలి? ఎంత చేస్తే ఈ గడ్డ రుణం తీర్చుకోగలము? అని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. కనుక తెలంగాణా కోసం ఇంతగా తపిస్తున్న వికె సింగ్ గారి ప్రయత్నాలు ఫలించాలని ఆశించి శలవు తీసుకోకుండా, ప్రతీ ఒక్కరూ అయనతో చేతులు కలిపి మన సమస్యలను మనమే పరిష్కరించుకొనే ఈ మహా ఉద్యమంలో భాగస్వాములం అవుదామా?       

ఇంటర్వ్యూ మొదటి భాగం లింక్: http://www.mytelangana.com/telugu/editorial/9404/sri-vk-singh-interview-given-to-dial-your-village   

మీరు ఈ చర్చ ఆడియో సంభాషణ వినాలనుకుంటే, ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి:

 https://fccdl.in/8xoQjFBiy   

డయల్ యువర్ విల్లేజ్ face book లింక్ :

https://www.facebook.com/groups/821757117915265/  


Related Post