రేవంత్ రాజీనామా ఊసెత్తని పార్టీలు!

November 16, 2017


img

రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వకుండా చంద్రబాబు చేతిలో పెట్టడం, నేటికీ దానిని అయన స్పీకర్ కు పంపించకపోవడం, రేవంత్ రెడ్డి కూడా తన రాజీనామాను ఆమోదింపజేసుకోకపోవడం గమనిస్తే, ఈ విషయంలో ఆయన తొందరపడదలచుకోలేదని స్పష్టం అవుతోంది. ఇంతకు ముందు కాంగ్రెస్, తెదేపా ఎమ్మెల్యేలు తెరాసలో చేరినప్పుడు చాలా హడావుడి చేసిన ఆ రెండు పార్టీల నేతలు కూడా రేవంత్ రెడ్డి రాజీనామా గురించి మాట్లాడకపోవడం విశేషమే. వారి సంగతి ఎలా ఉన్న తమ ప్రభుత్వంపై..ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమని తెరాస కూడా అడగకపోవడం విశేషమే. కాంగ్రెస్, టిడిపి, టిటిడిపి, తెరాస నేతలు ఎవరూ రేవంత్ రెడ్డి రాజీనామా గురించి మాట్లాడటానికి ఇష్టపడకపోవడం విచిత్రమే కదా? ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన సమస్య ఉంది కనుకనే అడగడంలేదని చెప్పవచ్చు. 

ముందుగా రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, ఆయనే నేరుగా స్పీకర్ కు తన రాజీనామా సమర్పించి ఆమోదింపజేసుకోవచ్చు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఇంకా పార్టీలో ఇమడటానికి సమయం పడుతుంది కనుక ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది నేతలు ఆయనకు అండగా నిలబడతారో తెలియదు.. కనుక ఉపఎన్నికలు వస్తే తన స్వంత బలంతోనే నెగ్గవలసి ఉంటుంది. కానీ ఇప్పటికే కొడంగల్ లో అయన అనుచరులు అనేకమంది తెరాసలో చేరిపోయారు. ఈ పరిస్థితులలో ఉప ఎన్నికలలో గెలిస్తే కాలర్ప ఎగరేసుకొని తిరుగవచ్చు కానీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీలో విలువ లేకుండా పోతుంది. తెరాస ముందు తలదించుకోవలసి వస్తుంది. కనుక రాజీనామా చేయడానికి మరికాస్త సమయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావించడం సహజమే.

ఇక చంద్రబాబు తలుచుకొంటే రేవంత్ రాజీనామా లేఖను గంటలో స్పీకర్ చేతికి చేర్చగలరు. కానీ ఆ తరువాత కొడంగల్ నియోజకవర్గంలో ఉపఎన్నికలు వస్తాయి కనుక వాటిలో టిటిడిపి రేవంత్ రెడ్డిపైనే పోటీ చేయవలసి ఉంటుంది. అది టిడిపికి టిటిడిపి నేతలకు, చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పిస్తాయి. కనుకనే టిడిపి, టిటిడిపిలు మౌనం వహించారని చెప్పవచ్చు. 

ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు కనుక అయనను గెలిపించుకోవలసిన బాధ్యత ఆ పార్టీపైనే ఉంటుంది. గెలిస్తే పరువాలేదు కానీ ఓడిపోతే తెరాస ముందు తలదించుకోవలసి వస్తుంది. బహుశః అందుకే అది ఈ విషయంలో మౌనం వహించి ఉండవచ్చు. 

ఇక చివరిగా తెరాస విషయానికి వస్తే, ఒకవేళ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనీ గట్టిగా పట్టుబడితే, ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సహా తెరాసలో చేర్చుకొన్న తెదేపా, కాంగ్రెస్, వైకాపా ఎమ్మెల్యేల రాజీనామాల కోసం ప్రతిపక్షాలు నిలదీయవచ్చు. కనుక రేవంత్ రెడ్డి రాజీనామా విషయంలో తెరాస కూడా మౌనం వహించి ఉందని చెప్పవచ్చు. ఇలాగ..అన్ని పార్టీలకు ఒక్కో కారణం, ఒక్కో రకమైన సమస్య ఉన్నందునే ఎవరూ రేవంత్ రెడ్డి రాజీనామా కోసం పట్టుబట్టడం లేదని భావించవచ్చు.       



Related Post