ఆ ముగ్గురే సారధ్యం వహించబోతున్నారా?

November 16, 2017


img

తెరాసలో ముఖ్యమంత్రి కెసిఆర్, కేటిఆర్, కవిత, హరీష్ రావు, ఈటల రాజేందర్, జూపల్లి, కడియం వంటి అనేక మంది హేమాహేమీలైన నేతలున్నారు. పైగా వారే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కనుక ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెరాసకు తడబడవలసిన అవసరం ఉండదు. 

కాంగ్రెస్ పార్టీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జైపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, వి హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, డికె అరుణ, గీతారెడ్డి వంటి అనేకమంది హేమాహేమీలున్నారు. ఆ జాబితాలో కొత్తగా రేవంత్ రెడ్డి కూడా చేరారు. ఈ మద్యనే మాజీ క్రికెటర్ అజారుద్దీన్, విజయశాంతి కూడా యాక్టివ్ అయ్యారు. కనుక వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి చాలా మందే ఉన్నారని చెప్పవచ్చు. 

అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన ‘బాహుబలి రేవంత్ రెడ్డి,’ పాత కాపులు కెప్టెన్ అజహరుద్దీన్, రాములమ్మలకు ప్రచారంలో కీలక భాద్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అజారుద్దీన్, షబ్బీర్ అలీ వంటి ముస్లిం నేతలు ముస్లిం ఓటర్లను, కెసిఆర్, కేటిఆర్, హరీష్ రావు తదితరులను డ్డీ కొనే బాధ్యత రేవంత్ రెడ్డికి, మహిళా ఓటర్లను ఆకట్టుకొనే బాధ్యత విజయశాంతి, డికె అరుణ తదితరులకు అప్పగించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో మిగిలిన సీనియర్ నేతలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగసభలు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ తమ రాజకీయ ప్రత్యర్ధులను డ్డీ కొనాలని కాంగ్రెస్ వ్యూహాలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. 

దీనిలో నిజానిజాలు ఎంతనే విషయం మరికొన్ని రోజులలోనే తెలుస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నేటికీ తెరాసను ధీటుగా ఎదుర్కోగల నేతలు అనేకమంది ఉన్నారనే దానిలో ఎటువంటి అనుమానమూ లేదు. వారిలో చాలా మంది నేటికీ తమ తమ నియోజకవర్గాలపై గట్టిపట్టు కలిగి ఉన్నారనే దానిలో కూడా ఎటువంటి సందేహమూ లేదు. కానీ కాంగ్రెస్ నేతలలో ఐక్యత కొరవడటం, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ పదవుల కోసం ఆరాటపడుతుండటం, ఆ కారణంగా కుమ్ములాటలు, ఆధిపత్యపోరు వంటి బలహీనతలున్నాయి. అందుకే కాంగ్రెస్ నేతలు ఎంత బలమైనవారైనప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడూ బలహీనంగానే ఉంటోంది. వారి ఈ బలహీనతలే వారి ప్రత్యర్ధులకు బలంగా మారుతోంది. ఈ విషయం కాంగ్రెస్ నేతలకు కూడా బాగానే తెలుసు. కానీ వారు తమ ఈ బలహీనతలను జయించలేకపోతున్నారు. 

పార్టీలో అందరికీ ఎప్పుడూ పదవులపైనే దృష్టి ఉంటుంది. అధికారంలోకి రావాలనే తపన కూడా ఉంది. కానీ దాని కోసం తమ విభేదాలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయలేకపోతున్నారు. ఆ బలహీనతే తెరాసకు శ్రీరామరక్ష కావచ్చు. ఆ బలహీనతలను అధిగమించలేనప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏ బాహుబలి కాపాడలేడని కాంగ్రెస్ నేతలు గ్రహిస్తే మంచిది.  


Related Post