ఆర్టీసీకి ఎపుడూ నష్టాలేనా..ఎందువల్ల?

November 15, 2017


img

ఆర్టీసీ ‘ప్రగతి రధచక్రాలు’ దశాబ్దాలుగా నష్టాల బాటలోనే పరుగులిడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక ప్రభుత్వం దానిని సరిద్దడంలో అశ్రద్ధ వహిస్తే కనీసం మరో ప్రభుత్వం అయినా దాని లోపాలను గుర్తించి సరిదిద్దవచ్చు. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ ప్రగతి రధచక్రాలు నష్టాల గతుకుల బాటలోనే పయనిస్తున్నాయి. కర్ణుడి చావుకు వంద శాపాలు..వెయ్యి కారణాలు అన్నట్లుగా ఆర్టీసి నష్టాలకు కూడా అన్నే ఉన్నాయి. అవేమిటో ప్రభుత్వాలకి, ఆర్టీసిని నడిపిస్తున్న అధికారులకు స్పష్టంగా తెలుసు. అయినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. 

ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా చొరవ తీసుకొని ఆర్టీసిని లాభాల బాట పట్టించేందుకు అనేక విలువైన సూచనలు చేశారు. అయినా ఆర్టీసీ పరిస్థితిలో మార్పు కనబడటం లేదు. నేటికీ నష్టాలలో మునిగిపోతున్న ఆర్టీసిని రాష్ట్ర ప్రభుత్వం ఒక చెయ్యి వేసి కాపాడవలసివస్తోంది. 

శాసనసభలో బుధవారం ఆర్టీసి నష్టాల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి సమాధానం చెపుతూ, గత మూడేళ్ళలో ఆర్టీసికి రూ.189 కోట్లు ప్రభుత్వం అందించిందని చెప్పారు. అదిగాక జి.హెచ్.ఎం.సి. రూ.336 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఆర్టీసిని నష్టాల బాట నుంచి బయటకు రప్పించేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా దానికి సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు. కొత్త ఆర్టీసి బస్సులు కొనుగోలు, ఆర్టీసి బస్టాండ్లలో మినీ సినిమా ధియేటర్ల నిర్మాణం, అనుమతిలేని ప్రైవేట్ బస్సులను కట్టడి చేయడం, ఏపికి బస్సుల సంఖ్య పెంచడం వంటి అనేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయసహకారాలు పొందని ప్రైవేట్ బస్సులు బారీగా లాభాలు ఆర్జిస్తూ నానాటికీ తమ బస్సుల సంఖ్య పెంచుకొంటూ ఉండగా, ఏటా క్రమం తప్పకుండా ప్రభుత్వం నుంచి ఇంత బారీగా నిధులు, సబ్సీడీలు,  సహాయసహకారాలు అందుకొంటున్నప్పటికీ...వేలకోట్ల విలువైన ఆస్తులున్నప్పటికీ...దాదాపు 75-99 శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ...ఆర్టీసి ఎందుకు నష్టాలలో కూరుకుపోతోంది? ప్రభుత్వంలో వివిధ శాఖలు మెల్లగా అభివృద్ధిపధం వైపు అడుగులు వేస్తుంటే ఆర్టీసీ మాత్రమే నష్టాల బాటలో ఎందుకు పయనిస్తోంది. ఆర్టీసిని ప్రభుత్వం ఎప్పటికీ ఆదుకొంటూ ఉండాల్సిందేనా? అది తన కాళ్ళ మీద తను ఎప్పటికీ నిలబడలేదా?ఇంతమంది మేదావులైన ఐఏఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నప్పటికీ, ఆర్టీసి సమస్యలను ఎవరూ పరిష్కరించలేరా? అనే సందేహాలు కలుగుతుంటాయి. 


Related Post