అలా చేస్తే తెరాస ఓటమి ఖాయం: కోమటిరెడ్డి

November 15, 2017


img

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం శాసనసభ ఆవరణలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ “రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పిసిసి అధ్యక్షు పదవి కావాలనో లేక ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తమను ప్రకటించాలనో కోరుకొంటున్నారు. ముప్పై ఏళ్ళుగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇంత సీనియారిటీ ఉన్నప్పుడు నేను పిసిసి అధ్యక్ష పదవి అడిగితే తప్పేముంది?” అని ప్రశ్నించారు.   

వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 99 శాతం మందికి మళ్ళీ టికెట్స్ ఇస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పినప్పటికీ, వారిలో కనీసం 40-50 మందిని తప్పకుండా మార్చేస్తారు. ఒకవేళ మార్చకపోతే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం,” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 

తాను పార్టీ మారుతున్నట్లు లేదా కొత్త పార్టీ పెడుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను అయన ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. 

తెరాస సిటింగ్ ఎమ్మెల్యేలలో 40-50 మందిని కెసిఆర్ మార్చేస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ, అపార రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఏదో గాలిలో బాణం విసిరారనుకోవడానికి లేదు. ఒకవేళ ఆయన చెప్పినట్లు అంతమందిని కాకపోయినా కనీసం 20-30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలనైనా మార్చడం అనివార్యం కావచ్చు. ఆ సమయంలో టికెట్స్ కోసం అన్ని వర్గాల నుంచి వచ్చే ఒత్తిళ్ళు, రాజకీయ అవసరాలు, బలాబలాల సమీకరణలు వగైరా ఈ అనివార్య పరిస్థితులను కల్పించవచ్చు. అదే నిజమైతే కోమటిరెడ్డి సిద్దాంతం ప్రకారం వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని భావించవలసి ఉంటుంది. మరి దీనిని అయన అంగీకరిస్తారో లేదో? 


Related Post