శాసనసభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పంటరుణాలన్నీ వడ్డీతో సహా మాఫీ చేసేశామని శాసనసభలో గొప్పలు చెప్పుకొన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వాటిని వివరించేందుకు ఒక ఉదాహరణ చెపుతాను” అంటూ ఆమె తన నియోజకవర్గంలోని ఒక రైతు పరిస్థితిని వివరించారు.
ఒక రైతు 2012లో బ్యాంక్ వద్ద లక్ష రూపాయలు రుణం తీసుకొన్నాడు. అది 2013కి వడ్డీతో కలిపి 1.28 లక్షలు అయ్యింది. రుణమాఫీ పధకంలో భాగంగా 2013లో ప్రభుత్వం మొదటి విడతగా రూ.25,000 విడుదల చేయాగా, అది మొత్తం వడ్డీకే పోయింది. అసలు తీరలేదు కానీ ఇంకా రూ.3,000 వడ్డీ మిగిలిపోయింది. మరుసటి సంవత్సరానికి మళ్ళీ అది వడ్డీతో కలిపి 1.23 లక్షలు అయ్యింది. రెండవ విడత రుణమాఫీ క్రింద రాష్ట్ర ప్రభుత్వం 2014లో విడుదల చేసిన రూ.25,000 లలో మళ్ళీ 23,000 వడ్డీకి పోగా మిగిలిన రెండువేలు అసలు క్రింద జామా అయ్యాయి. మిగిలిన రెండు విడతలలో కూడా ఇంచుమించు ఇదేవిధంగా జరిగింది. నాలుగు విడతలలో మొత్తం రుణమాఫీ అయ్యే సమయానికి ఆ రైతు చేసిన అప్పు అలాగే ఉండిపోయింది. వడ్డీ మాత్రమే తీరింది. ఆ రైతు దానిని తీర్చుకోలేని పరిస్థితిలో మళ్ళీ వచ్చే ఏడాదికి అది వడ్డీతో కలిపి రూ.1.23 లక్షలు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసేశామని చేతులు దులుపుకొంది. కానీ రాష్ట్రంలో వేలాది మంది రైతుల అప్పులు ఇప్పటికీ ఇంకా అలాగే మిగిలి ఉన్నాయి. ఇదేనా మీరు చేసిన రుణమాఫీ? దీని వలన రైతుకు ఏమైనా ప్రయోజనం కలిగిందా? అని డికె అరుణ ప్రశ్నించారు.
ఆమెకు వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ సమాధానం చెపుతూ, “మేము వడ్డీతో కలిపి లక్ష రూపాయల లోపు రుణాలను మాత్రమే తీరుస్తామని స్పష్టంగా చెప్పాము. కనుక ఆ రైతు తీసుకొన్న రుణంపై వడ్డీని కట్టుకొని ఉండి ఉంటే, రుణం తీరిపోయేది. కానీ అతను ఆవిధంగా చేయకపోవడం వలన అప్పు మిగిలిపోయి ఉండవచ్చు,” అంటూ తమ ప్రభుత్వం పంటరుణాల మాఫీ కోసం ఎంత నిధులు విడుదల చేసింది..ఎంతమంది రైతులను రునవిముక్తులను చేసింది గణాంకాలను వివరించారు. ఇద్దరి వాదనలు సహేతుకంగానే ఉన్నప్పటికీ, రుణం తీసుకొన్న రైతు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మిగిలిపోవడమే విషాదకరం. దీనికి తెరాస సర్కార్ ఏమి పరిష్కారం చెపుతుందో చూడాలి.