తెలంగాణా జలనిధి: ఆర్.విద్యాసాగర్ రావు

November 15, 2017


img

తెలంగాణా రాష్ట్రం ఎదుర్కొంటున్న నీటి సమస్యల పరిష్కారం కోసం తన జీవితాన్నే వెచ్చించిన వ్యక్తి స్వర్గీయ ఆర్.విద్యాసాగర్ రావు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, రాష్ట్రంలో ఉన్న నీటివనరులను ఏవిధంగా అభివృద్ధి చేసుకోవాలి.. ఎక్కడ ఎంత నీటి లభ్యత ఉంది. దానిని ఏవిధంగా సమర్ధంగా వినియోగించుకోవాలి వంటి అన్ని అంశాలపై సమగ్ర ప్రణాళికను రూపొందించడంలో ఆర్.విద్యాసాగర్ రావు కీలక పాత్ర పోషించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి,  దిండి, దేవాదుల, కంతనపల్లి, సీతారామ ప్రాజెక్టుల రూపకల్పనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర సాగునీటి సలహాదారుగా అయన అందించిన సేవలు అనన్యసమాన్యమైనవి. తెలంగాణాలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని తపించిన ఆ మహనీయుడు ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన కన్నుమూశారు.

ఆయన గౌరవార్ధం ఆయన జన్మదినమైన నవంబర్ 14వ తేదీని ‘తెలంగాణా సాగునీటిదినం’ గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా నిన్న ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంజనీర్స్ (తెలంగాణా శాఖ)  రాష్ట్ర సాగునీటి శాఖ ఆధ్వరంలో  హైదరాబాద్ లో  స్వర్గీయ ఆర్.విద్యాసాగర్ రావు స్మృత్యర్ధం ఒక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. తెలంగాణా జలవనరుల అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ వి ప్రకాష్, సాగునీరు అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ ఈ. శంకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఆర్.విద్యాసాగర్ రావు రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న నీటి సమస్యలు, వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సాగునీరు, త్రాగునీరు ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. 

ఆర్.విద్యాసాగర్ రావు నల్లగొండ జిల్లాలో జాజిరెడ్డిగూడెంలో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఆర్. రాఘవరావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసేవారు. ఆయనకు బదిలీలు అయినప్పుడల్లా ఆర్.విద్యాసాగర్ రావు చదువులు కూడా బదిలీ అవుతుండేవి. ఆయన ప్రాధమిక విద్యను హుజూర్ నగర్, మిర్యాలగూడలో పూర్తి చేశారు. ఆ తరువాత సూర్యాపేటలో 10వ తరగతి వరకు చదువుకొన్నారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో పీయుసి, 1960లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్, 1979లో యూనివర్సిటీ ఆఫ్ రూర్కెలా నుంచి నీటివనరుల ఇంజనీరింగ్ లో మాష్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలో కొలరాడో స్టేట్ యూనివర్సిటీ నుంచి 1983లో వాటర్ రీసౌర్స్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేశారు. తరువాత డిల్లీ యూనివర్సిటీ నుంచి 1990లో న్యాయశాస్త్రంలో డిగ్రీ కూడా చేశారు. ఆ తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాగునీటి రంగంలో పనిచేసి  విశేష అనుభవం గడించి రాష్ట్రానికి విశేష సేవలు అందించారు. 


Related Post