నేటికీ తెలంగాణాలో ఆత్మహత్యలు ఆగలేదు!

November 14, 2017


img

ఈరోజు శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్, భాజపా శాసనసభ్యులు తెరాస సర్కార్ తీరును ఎండగట్టారు. బడ్జెట్ మిగులు, కేటాయింపుల విషయంలో ప్రభుత్వం లేనిదీ ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి విమర్శించారు. 

నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ, నేటికీ ఆ మూడు అంశాలలో తెరాస సర్కార్ చేసిందేమీ లేదని, ఆ కారణంగా నేటికీ నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని భాజపా ఎమ్మెల్యే లక్ష్మణ్ విమర్శించారు. ఈ మూడేళ్ళలోనే 50,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే, తెరాస సర్కార్ కనీసం వాటినైనా తిరిగి భర్తీ చేయలేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలే చెపుతున్నాయని, అయినా ప్రభుత్వం వాటిని భర్తీ చేయడానికి వెనకాడుతోందని అన్నారు. ఉద్యోగాల భర్తీకి జారీ చేస్తున్న నోటిఫికేషన్స్ విషయంలో కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వలన ఆర్టీసి నష్టాలపాలవుతోందని ఒక బస్సు కండెక్టర్ సోషల్ మీడియాలో మెసేజ్ ద్వారా తన ఆవేదన తెలియపరిస్తే, ప్రభుత్వం అతనిని సస్పెండ్ చేసి అతనిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని అన్నారు. తెరాస సర్కార్ నియంతృత్వ పోకడలను చూస్తుంటే మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? అని అనుమానం కలుగుతోందని లక్ష్మణ్ అన్నారు.

భాజపా సభ్యుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి ఇద్దరూ కూడా ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ తో వాగ్వాదానికి దిగారు. వారికి అయన ధీటుగా, ఘాటుగా సమాధానాలు చెప్పినప్పటికీ ఈరోజు మాత్రం సభలో ప్రతిపక్షాలదే పైచేయిగా కనిపించింది. 


Related Post