రాష్ట్రాభివృద్ధికి అప్పులు తప్పవు: ఈటెల

November 14, 2017


img

తెలంగాణా ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ తో దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా అవతరించిందని సాక్షాత్ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా చాలాసార్లు చెప్పిన సంగతి తెలుసు. కానీ ఈ మూడేళ్ళలో సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉన్న భవనాలను ఉపయోగించుకోకుండా వాస్తు దోషం ఉందనే కారణంతో వేలకోట్లు ఖర్చు చేసి కొత్తకొత్త భవనాలను నిర్మించడానికి, తెరాసనేతలు, కార్యకర్తలకు లబ్ది కలిగించే పధకాలు, ప్రాజెక్టుల కోసం విచ్చలవిడిగా అప్పులు, ఖర్చులు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. తెరాస సర్కార్ అనాలోచితం చేస్తున్న ఈ అప్పుల కారణంగా రాష్ట్రం ఆ ఊబిలో నుంచి ఎన్నటికీ బయటపడలేనివిధంగా కూరుకుపోతోందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

వారి విమర్శలు, ఆరోపణలకు రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ ఈరోజు శాసనసభలో గట్టిగా సమాధానం చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకొంటే డబ్బు అవసరం. ప్రజలకు, రాష్ట్రానికి మేలు కలిగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు వంటివి చేపట్టడానికి అప్పులు తీసుకొంటే తప్పు కాదు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈస్థాయిలో అభివృద్ధిపనులు చేపట్టాలనుకోలేదు కనుక అప్పులు అవసరం పడలేదు. కానీ అభివృద్దే మా ప్రభుత్వ ప్రాధాన్యత కనుక దాని కోసం అప్పులు తీసుకోవడం తప్పని మేము భావించడం లేదు. 

అయినా రాష్ట్రాలు తమ ఇష్టానుసారం అప్పులు చేయడానికి వీలులేదు. ఎఫ్.అర్.బి.ఎం.పరిమితి, నిబంధనలకు లోబడే అప్పులు లభిస్తాయి. అభివృద్ధి పనుల కోసమే వాటిని తీసుకొంటున్నాము. అప్పులు చేయకూడదనుకొంటే అభివృద్ధి కూడా జరుగదు. నిరంతరంగా సాగవలసిన అభివృద్ధి నిలిచిపోతే నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ఇతర సామాజిక సమస్యలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. దేశంలో మన రాష్ట్రం ఒక్కటే కాదు...అన్ని రాష్ట్రాలు అప్పులు తీసుకొంటున్నాయి. రాష్ట్రాలే కాదు దేశాలు కూడా అభివృద్ధి పనుల కోసం అప్పులు తీసుకొంటూనే ఉన్నాయి. ఇది సహజ ప్రక్రియ. కనుక ఈ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు అర్ధరహితమే,” అని మంత్రి ఈటల అన్నారు. 

మంత్రి ఈటల రాజేందర్ చెప్పినది 100 శాతం నిజమే అయితే అప్పులను కేవలం అభివృద్ధి పనులపైనే ఖర్చు చేసినప్పుడే ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి లేకుంటే ప్రతిపక్షాలు వాదిస్తున్నట్లు భవిష్యత్ లో అప్పులు..వాటి భారమే  మిగులుతుంది. 

ఉదాహరణకు బతుకమ్మ చీరల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.220 కోట్లు ఖర్చు చేసింది. దాని ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల కార్మికులకు పని, ఆదాయం కల్పించడం, బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో పేద మహిళందరికీ కొత్త చీరలు పెట్టడం. అయితే ఈ పధకంలో ఆ రెండు ప్రయోజనాలు నేరవేరలేదనే సంగతి అందరికీ తెలుసు. సూరత్ వ్యాపారులు, కొందరు తెరాస నేతలు మాత్రమే దాని వలన లబ్ది పొందారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి అందరూ విన్నారు. 

అలాగే మిషన్ భగీరధ పధకం భాగంగా అనేక గ్రామాలలో పాత పైపులున్నప్పటికీ, మళ్ళీ వాటి పక్కనే కొత్త పైపులను ఎందుకు వేస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నకు జవాబు రాలేదు. 

అభివృద్ధి కోసం అప్పులు చేయడం తప్పు కాదు కానీ తెచ్చిన డబ్బును సక్రమంగా ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రతిపక్షాలు ఇదే మాట చెప్పదలచుకొన్నప్పటికీ, వాటి రాజకీయ ప్రయోజనాలను అవి దృష్టిలో ఉంచుకొని దీనినే వేరే విధంగా చెపుతున్నాయి. 


Related Post