చంద్రబాబు నాయుడు హామీ మేరకు గవర్నర్ పదవి లభిస్తుందనే ఆశతో టిటిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు గత మూడున్నరేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఇక ఆ ఆశ తీరేలా లేదని మళ్ళీ మెల్లగా రాజకీయాలలో యాక్టివ్ అవుతున్నట్లున్నారు. రేవంత్ రెడ్డి కోరుకొంటున్నట్లుగా కాంగ్రెస్ పార్టీతో కలవడం సరికాదని, తెదేపా, భాజపా, తెరాస మూడు పార్టీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొని కలిసి పనిచేస్తే బాగుంటుందనే స్టేట్ మెంట్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ బాగానే మొదలుపెట్టారు మోత్కుపల్లి. ఆ వ్యాఖ్యలు తెదేపాలో ఎంత సంచలనం సృష్టించాయో అందరూ చూశారు. మూడు పార్టీలు కలిసి పనిచేస్తే తప్ప వచ్చే ఎన్నికలలో తెరాసతో సహా ఏ పార్టీ గెలవలేదని కొన్ని రోజుల క్రితం బల్లగుద్ది మరీ వాదించిన మోత్కుపల్లి, ఈరోజు అందుకు పూర్తి విరుద్దంగా “ వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో తెదేపా ఒంటరిగానే పోటీ చేస్తుంది. పార్టీ నుంచి ఎంతమంది నేతలు బయటకు వెళ్ళిపోయినప్పటికీ, రాష్ట్రంలో మా క్యాడర్ చెక్కుచెదరలేదు. కనుక వారి సహకారంతో పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతాము,” అని చెప్పారు.
తెరాసతో తెదేపా పొత్తులనే వార్త కారణంగానే రేవంత్ రెడ్డి తెదేపా దూరం అయిన సంగతి తెలిసిందే. కనుక ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడితే దాని వలన టిటిడిపికి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది కనుక వాటి గురించి టిటిడిపి నేతలు ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు సూచించారు. బహుశః అందుకే మోత్కుపల్లి కూడా ‘పొత్తుల పాట’ను పక్కనపెట్టి ‘ఒంటరి పోరు’ పాటను అందుకొన్నట్లున్నారు. తెలంగాణాలో తెదేపా ఒంటరి పోరాటం చేయగలదేమో కానీ వచ్చే ఎన్నికలలో గెలవడం దాదాపు అసంభవంగానే కనిపిస్తోంది. భాజపా పరిస్థితి అలాగే ఉంది. కనుక మళ్ళీ అయిష్టంగానైనా ఆ రెండు పార్టీలు చేతులు కలుపక తప్పకపోవచ్చు.