గుజరాత్ ఎన్నికల కోసమే అది తగ్గించారుట

November 13, 2017


img

మహారాష్ట్రలో  భాజపాకు శివసేన మిత్రపక్షం, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామి కూడా. అయినా ఎప్పుడూ భాజపాను, కేంద్రాన్ని తన రాజకీయ శత్రువుగానే భావిస్తూ విమర్శలు గుప్పిస్తుండటం విశేషం. గౌహతీలో జరిగిన జి.ఎస్.టి. కౌన్సిల్ సమావేశంలో 177 ఉత్పత్తులపై జి.ఎస్.టి. తగ్గించడంపై శివసేన అధికార పత్రిక సామ్నాలో తీవ్ర విమర్శలు గుప్పించింది. 

జి.ఎస్.టి.ని ప్రవేశపెట్టినప్పుడు దానిని యావత్ దేశప్రజలు సమర్దిస్తున్నారని గొప్పలు చెప్పుకొన్న మోడీ సర్కార్, ఇప్పుడు అదే జి.ఎస్.టి.పై దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతను చూసి వెనక్కు తగ్గకతప్పలేదని శివసేన విమర్శించింది. భాజపాకు అత్యంత కీలకమైన గుజరాత్ ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే కేంద్రం జి.ఎస్.టి. తగ్గించిందని విమర్శించింది. ఆ ఓటమి భయంతోనే భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,  కేంద్రమంత్రులను గుజరాత్ లో మొహరించిందని శివసేన ఎద్దేవా చేసింది. 

కొన్ని సర్వే నివేదికలలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో భాజపాయే విజయం సాధించబోతోందని తేల్చి చెప్పినప్పటికీ, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి గుజరాత్ లో భాజపాకు ఎదురుగాలులు వీస్తున్నాయి. జి.ఎస్.టి. అమలులోకి వచ్చి అప్పుడే 5-6 నెలలు గడిచిపోయాయి...ఇప్పుడిప్పుడే ఆ వేడి చల్లారుతోందని కేంద్రం సంతోషపడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా జి.ఎస్.టి.పై మళ్ళీ దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయడంలో సఫలీకృతం కావడంతో మోడీ సర్కార్ కు చాలా ఇబ్బందికరంగా మారింది. 

జి.ఎస్.టి. వలన అత్యధికంగా నష్టపోయినవారిలో గుజరాతీయులే ఉన్నారు. కనుక గుజరాత్ ఎన్నికలలో జి.ఎస్.టి. అనే బ్రహ్మాస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా వాడుకొంటోందని చెప్పవచ్చు. గుజరాత్ లో జరుగబోయేవి కేవలం శాసనసభ ఎన్నికలే అయినప్పటికీ, మరొక ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నందున భాజపాకు అవి సెమీ ఫైనల్స్ వంటివని చెప్పవచ్చు. దానికి కంచుకోటగా చెప్పుకోబడే గుజరాత్ లోనే ఒకవేళ అది ఓడిపోయినట్లయితే ఆ ప్రభావం దానిపై చాలా తీవ్రంగా పడుతుంది. అందుకే గుజరాత్ ఎన్నికలలో విజయం సాధించడం భాజపాకు అత్యవసరంగా మారింది. అక్కడ మళ్ళీ అధికారం నిలబెట్టుకొనేందుకు భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. కనుక జి.ఎస్.టి. వలన తీవ్రంగా నష్టపోయిన గుజరాతీ వ్యాపారులను మళ్ళీ ప్రసన్నం చేసుకోవడానికే జి.ఎస్.టి. తగ్గించి ఉండవచ్చనే శివసేన వ్యాఖ్యలను కాదనలేము. 


Related Post