దక్షిణాది రాష్ట్రాలలో సినీ హీరోహీరోయిన్లు ప్రత్యక్షరాజకీయాలలో ప్రవేశించడం సర్వసాధారణమైన విషయంగానే ప్రజలు కూడా భావిస్తున్నారు. గత 3-4 దశాబ్దాలుగా దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది రాజకీయాలలోకి ప్రవేశించగా వారిలో కొందరు రాణించారు మరికొందరు రాణించలేక అప్రదిష్టపాలైనవారున్నారు.
కర్ణాటకలో ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఈమద్యనే కొత్తపార్టీ స్థాపించి రాజకీయాలలోకి ప్రవేశించారు. ప్రస్తుతం తమిళనాడులో కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేయడానికి సిద్దం అవుతున్నారు. ఏపి, తెలంగాణా రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ జనసేనతో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు.
వారందరూ రాజకీయాలలోకి ప్రవేశించడానికి ప్రధానంగా చెపుతున్న కారణం ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అవినీతి, అసమర్ధత, అరాచకత్వం నెలకొని ఉందని, అస్తవ్యస్తంగా మారిన రాజకీయ వ్యవస్థల వలన సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, వారి ఆవేదన చూసి తాము కూడా ప్రజలకు ఏమైనా చేయాలనే సదుదేశ్యంతోనే రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నామని చెపుతున్నారు. ఇది పైకి చెపుతున్న కారణం కాగా, అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు. తమకున్న అపారమైన ప్రజాధారణను ఉపయోగించుకొని అధికారంలోకి రావాలనే కోరిక కూడా వాటిలో ఒకటిని చెప్పవచ్చు. అందుకు చిరంజీవిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అయితే, ఈ కారణంగా సినిమా హీరోలు రాజకీయాలలో ప్రవేశించడానికి అనర్హులనలేము కానీ ప్రజాధారణ ఉంది కదాని దానిని ఉపయోగించుకోవడానికే రాజకీయాలలోకి రావడం తప్పని, అర్హత, సామర్ధ్యం, చిత్తశుద్ధిని బట్టే రాజకీయాలలోకి రావడం మంచిదని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా రాజకీయాలలోకి ప్రవేశిస్తున్న సినీ నటులపై అభిమానంతో ఓట్లు వేయకుండా వారు అందుకు అర్హులాకారా? అని ఆలోచించుకొని ఓట్లు వేయాలని చెప్పారు. తనకు రజనీకాంత్, కమల్ హాసన్, ఉపేంద్ర అంటే చాలా గౌరవమని కానీ ఆ కారణం చేత వారికి గుడ్డిగా ఓట్లు వేయనని చెప్పారు.
అయన చెప్పిన ఈ మాటలు నూటికి నూరు శాతం నిజమేనని చెప్పవచ్చు. అయితే అభ్యర్ధుల గుణగణాలు, అర్హతలు చూసి కాకుండా వారి కులమతాలు ఇతర సమీకరణాలను చూసి ఓట్లు వేస్తున్న ప్రజలకు, తమకున్న ప్రజాధారణను ఓట్ల రూపంలోకి మార్చుకోవలనుకొంటున్న సినీ నటులకు ప్రకాష్ రాజ్ చెపుతున్న ఈ మంచి ముక్కలు చెవికి ఎక్కించుకొంటారా? ఏమో?