కొద్దిరోజుల క్రితం వరకు టిటిడిపిలో కలిసి పనిచేసిన ఎల్.రమణ, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆగర్భశత్రువులలాగ పరస్పర విమర్శలు, సవాళ్ళు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే వారి శత్రుత్వానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కారణం కావడమే విచిత్రం.
తెదేపాలో నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ మారడంతో ఒక సామాన్య కార్యకర్త స్థాయికి దిగజారిపోయాడని, త్వరలోనే కొడంగల్ నియోజకవర్గంలోనే టిటిడిపి బహిరంగసభ నిర్వహించి రేవంత్ రెడ్డికి తమ సత్తా చూపిస్తామని ఎల్ రమణ సవాలు విసరగా, రేవంత్ రెడ్డి కూడా అంతకంటే ధీటుగా ప్రతివిమర్శలు, ప్రతి సవాలు విసిరారు. తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు.
శనివారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “కెసిఆర్ దగ్గర డబ్బు సంచులు తీసుకొని బ్రతికే ఎల్.రమణ ఒక ఉపాధి కూలి వంటివాడు. అయన కెసిఆర్ దగ్గర డబ్బు తీసుకొని తెదేపాను మెల్లమెల్లగా ముంచేస్తున్నాడు. తెదేపా ముఖ్య నేత కంచర్ల భూపాల్ రెడ్డి తెరాసలో చేరితే నోరు మెదపని ఎల్.రమణ, నాపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నాడో ఆలోచిస్తే అర్ధమవుతుంది. నా యుద్ధం కెసిఆర్ తోటే గానీ అయన వద్ద పనిచేసే ఉపాధి కూలీలతో కాదు.
ఒకవేళ ఎల్.రమణకు నిజంగా కెసిఆర్ ను ఎదిరించేంత ధైర్యం ఉంటే, అయన కొడంగల్ లో కాదు..వెళ్ళి గజ్వేల్ లేదా సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించి చూపాలి. అయన టిటిడిపిలో ఒక్కొక్కరినీ దగ్గరుండి తెరాసలోకి సాగనంపుతూ మళ్ళీ తెలంగాణాలో టిటిడిపికి తిరుగులేదని చెపుతుంటారు. నేను కాంగ్రెస్ పార్టీలోకి మారినా నావెంట ఎవరినీ రమ్మని అడగలేదు. నేను ఎందుకు పార్టీ మారవలసి వచ్చిందో చంద్రబాబు నాయుడుకు స్పష్టంగా చెప్పేవచ్చాను. కనుక ఎల్.రమణ వంటివారి విమర్శలకు నేను జవాబు ఈయనవసరం లేదు.
రాజకీయంగా నా ఎత్తులు, వ్యూహాలు నాకున్నాయి. డిసెంబర్ 9న ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాను. ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇక ఎప్పుడూ నాగురించే ఆలోచించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుందని ఖచ్చితంగా చెప్పగలను,” అని రేవంత్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి ఇంతవరకు ఏపి టిడిపి నేతలపైనే విమర్శలు, ఆరోపణలు చేశారు తప్ప టిటిడిపి నేతలపై పెద్దగా చేయలేదు. మొదటిసారిగా ఎల్.రమణపై తీవ్ర ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి పార్టీ మారాలని నిశ్చయించుకొన్నప్పుడు తెలంగాణాలో పార్టీ పతనానికి ఆయనే కారణమని ఎల్.రమణ, తదితరులు విమర్శించారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎల్.రమణను వేలెత్తి చూపిస్తూ ఆయనే పార్టీని ఒక పద్దతి ప్రకారం కూల్చివేస్తున్నాడని ప్రత్యారోపణలు చేయడం విశేషం. వారిరువురి ఆరోపణలు వింటే రాష్ట్రంలో తెదేపా పతనానికి తెరాస కంటే తెదేపా నేతలే ప్రధాన కారణమని అర్ధం అవుతోంది. టిటిడిపి నేతలు చెపుతున్న ఈ విషయాలు చంద్రబాబు నాయుడుకు తెలియవనుకోలేము. అయినా ఆయన కూడా ప్రేక్షకపాత్ర పోషించడమే విడ్డూరంగా ఉంది.