సుమారు ఏడాదిన్నర క్రితం ఏపి శాసనసభలో వైకాపా ఎమ్మెల్యే రోజా అనుచితంగా ప్రవర్తించినందుకు శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయబడింది. అప్పుడు ఆమె తనను సభ నుంచి ఏడాది పటు సస్పెండ్ చేయడం అన్యాయమని దానిని ఉపసంహరింపజేయాలని కోరుతూ సుప్రీం కోర్టు వరకు వెళ్ళి పోరాడారు.
శాసనసభ సమావేశాలలో తిరిగి పాల్గొనడానికి అంతగా పోరాడిన ఎమ్మెల్యే రోజా, ఇప్పుడు శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా డుమ్మా కొడుతుండటం విశేషం. ఎందుకంటే ఆమె పార్టీ అధినేత శాసనసభ సమావేశాలను బహిష్కరించి ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. అయనను కాదని రోజాతో సహా ఎవరూ శాసనసభ సమావేశాలకు హాజరయ్యే సాహసం చేయలేరు. చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. కనుక రోజా కూడా సమావేశాలకు డుమ్మా కొట్టి, తిరిగి తెదేపా సర్కార్ పై ఎదురుదాడి చేస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.
ఇంతకు ముందు శాసనసభ సమావేశాలకు రానివ్వడంలేదని రోడ్డు పక్కన పడుకొని కన్నీళ్ళు పెట్టుకొన్న రోజా ఇప్పుడు శాసనసభకు ఎందుకు రావాలని ప్రశ్నిస్తుండటం విచిత్రమే కదా? శాసనసభ సమావేశాలకు హాజరవడానికి ఇష్టపడని జగన్, వైకాపా ఎమ్మెల్యేలు, మళ్ళీ 2019 శాసనసభ ఎన్నికలలో పోటీ చేయాలనుకోవడం..వాటిలో ప్రజలు తమనే గెలిపిస్తారని గొప్పలు చెప్పుకోవడం...అందుకోసమే ఇప్పుడు పాదయాత్రలు చేయడం ఇంకా హాస్యాస్పదంగా ఉంది కదా.