రాష్ట్ర భాజపా నేతలు తెరాస సర్కార్ పై ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, కేంద్రప్రభుత్వం నేటికీ దానితో సత్సంబంధాలే కొనసాగిస్తోంది. బహుశః వచ్చే ఎన్నికలలో తెరాసతో పొత్తులు పెట్టుకొనే ఆలోచనతోనే అది తెరాస సర్కార్ తో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందని చెప్పవచ్చు. గత ఏడాది సూర్యాపేటలో జరిగిన భాజపా బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా తెరాసకు స్నేహహస్తం అందించారు కానీ తెరాస అధినేత కెసిఆర్ విముఖత చూపారు. అయినా నేటికీ తెరాస సర్కార్ పట్ల కేంద్రప్రభుత్వ స్నేహపూరితంగానే వ్యవహరిస్తూనే ఉంది. రాష్ట్ర భాజపా నేతలు కూడా ఒక్క ముస్లిం రిజర్వేషన్స్ అంశంపైనే తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతుంటారు తప్ప ఇతర అంశాలపై పెద్దగా పట్టించుకొన్నట్లుగా కనబడరు. అంటే నేటికీ తెరాసతో పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచన భాజపాలో ఉన్నట్లే కనబడుతోంది.
అయితే తెలంగాణాలో హిందూ ఓట్లు పార్టీల వారిగా చీలే అవకాశం ఉంది కనుక భాజపా చెయ్యి పట్టుకొంటే తెరాసకు ఒరిగేదేమీ ఉండదు. పైగా భాజపా మతతత్వముద్ర తెరాసకు అంటుకొనే ప్రమాదం ఉంటుంది. బహుశః అందుకే అది భాజపాతో చేతులు కలిపేందుకు సంకోచిస్తున్నట్లు చెప్పవచ్చు. అదే..మజ్లీస్ తో చేతులు కలిపినట్లయితే రాష్ట్రంలో ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తగా ఆ రెండు పార్టీల ఖాతలోనే జమా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో పూర్తి మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రావడానికి అది చాలా అవసరం కూడా. అందుకే భాజపాతో కంటే మజ్లీస్ వైపు ఎక్కువగా తెరాస మొగ్గు చూపుతున్నట్లు భావించవచ్చు.
ఇక మజ్లీస్ పార్టీకి అధికారంలో ఉండే రాజకీయ పార్టీల ఈ బలహీనత గురించి బాగా తెలుసు. అందుకే అది ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే లేదా ఏది అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో దానితోనే జత కడుతుంటుంది. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. పాతబస్తీకే పరిమితమైన కారణంగా అది ఎప్పటికీ అధికార పార్టీకి తోకపార్టీగానే ఉండిపోవలసివస్తోంది. దాని మనుగడ కాపాడుకోవడం కోసం అది చాలా అవసరం కూడా.
తెరాసకు దగ్గరవడానికి భాజపా, తెదేపాలు చేస్తున్న ప్రయత్నాలు మజ్లీస్ గమనించలేదనుకోలేము. ఎలాగూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక తెరాసతో పొత్తులకు భాజపా మరోసారి గట్టి ప్రయత్నం చేయవచ్చు. దాని ఒత్తిడికి లొంగి అది మళ్ళీ భాజపావైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి కనుక మజ్లీస్ పార్టీ ముందే జాగ్రత్తపడింది. వచ్చే ఎన్నికలలో తెరాసతో కలిసి పోటీ చేస్తామని మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో ప్రకటించేశారు. అక్బరుద్దీన్ ‘విష్ లిస్ట్’ ను తూచా తప్పకుండా అమలుచేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దపడటం గమనిస్తే, మజ్లీస్ పొత్తుల ప్రతిపాదనకు తెరాస కూడా సానుకూలంగానే స్పందించినట్లు భావించవచ్చు. అంటే తెరాస భాజపా వైపు చూడకుండా, అలాగే భాజపా తెరాసవైపు చూడకుండా మజ్లీస్ పార్టీ ముందే పొత్తుల విషయంలో ‘డీల్ క్లోజ్’ చేసి, భాజపాకు చెక్ పెట్టినట్లే భావించవచ్చు. కనుక ఇప్పుడు భాజపా తెదేపాతో మళ్ళీ చేతులు కలపాలో వద్దో నిర్ణయించుకోవలసి ఉంటుంది.