రేవంత్ రాజీనామా చేయలేదు: రమణ

November 10, 2017


img

రేవంత్ రెడ్డి టిటిడిపిలో ఉన్నంత కాలం ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడని ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఇప్పుడు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండటం గమనిస్తే, ఇంతకాలం అయన మనసులో రేవంత్ రెడ్డిపై ఎంత కోపం అణచిపెట్టి ఉంచుకొన్నారో అర్ధం అవుతోంది. 

ఈరోజు అయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ఇంతవరకు రాజీనామా చేయలేదు. తన రాజీనామా పత్రాన్ని ఆయన చంద్రబాబు నాయుడుకు ఇచ్చాడన్న మాట అబద్దం. ఆయనకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఉద్దేశ్యమే ఉన్నట్లయితే నేరుగా స్పీకర్ మధుసూదనాచారికి ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా చంద్రబాబుకు ఇచ్చానని చెప్పుకొంటున్నారు. రేవంత్ రెడ్డి అనేక పార్టీలు మారిన చరిత్ర ఉంది. ఆయనకు తెదేపాలో నాయకుడిగా ఎదిగే అవకాశం కల్పిస్తే పార్టీని వీడిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక సామాన్య కార్యకర్త స్థాయికి తన స్థాయిని దిగజార్చుకొన్నాడు. అయన కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన్న ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తుందనుకోవడం అవివేకం, భ్రమ. తెలంగాణాలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం తెదేపాయే తప్ప మరో పార్టీ కానేకాదు. త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజక వర్గంలోనే బారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆయనకు మా సత్తా ఏమిటో చూపిస్తాము. అక్కడి నుంచే తెలంగాణాలో టిటిడిపి జైత్రయాత్ర మొదలుపెడతాము,” అని అన్నారు.

రేవంత్ రెడ్డి రాజీనామా గురించి ఎల్ రమణ చెప్పిన మాట చాలా విడ్డూరంగా ఉంది. రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్ కు సమర్పించి ఉంటే బాగుండేదన్న మాట వాస్తవమే. అయితే స్పీకర్ ఫార్మాట్ లోనే వ్రాసిన తన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడు కార్యదర్శికి ఇచ్చిన మాట కూడా వాస్తవమే. ఒకవేళ ఇవ్వకపోయుంటే, ఆ ముక్క చంద్రబాబు చెపితే అప్పుడు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. కానీ చంద్రబాబు చెప్పడం లేదు. అంటే ఈ విషయంలో రమణే అబద్దం చెపుతున్నట్లు భావించక తప్పదు.

నిజానికి చంద్రబాబు నాయుడు తలుచుకొంటే గంటలో ఆ లేఖ స్పీకర్ చేతికి చేరవేయగలరు. కానీ రేవంత్రా రెడ్డి జీనామా చేసి పది రోజులు గడుస్తున్నా ఇంతవరకు దానిని స్పీకర్ కు పంపలేదంటే అర్ధం ఏమిటి? అయన రాజీనామాను ఆమోదింపజేయాలని చంద్రబాబు కూడా కోరుకోవడం లేదనే కధా అర్ధం! రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను తమ చేతిలో ఉంచుకొని, ఆయన రాజీనామా చేయలేదని రమణ నిందించడం చూస్తే ఇదేదో సరికొత్త డ్రామాలా కనిపిస్తోంది.

ఇక ఈ పరిస్థితులలో కూడా తెలంగాణాలో తెరాసకు టిటిడిపియే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడం విశేషమే. కొడంగల్ లో సభ నిర్వహిస్తే టిటిడిపికి కొత్తగా ఏమి ఒరుగుతుంది ఏమి సాధిస్తుంది? తెలంగాణాలో తెదేపాను గెలిపించుకోవాలంటే టిటిడిపి నేతలు పోరాటం చేయవలసింది రేవంత్ రెడ్డితో కాదు..తెరాస, కాంగ్రెస్ పార్టీలతో అని గ్రహిస్తే మంచిది.


Related Post