తెలంగాణా సంక్షేమం కోసం పరితపిస్తున్న బిహార్ ఐపిఎస్ అధికారి (1)

November 10, 2017


img

అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస తెలంగాణావాసులు ‘డయల్ యువర్ విలేజ్’ పేరిట ప్రతీవారం రాష్ట్రంలో వివిధ రంగాలలో ప్రముఖులతో మాట్లాడి, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం రాష్ట్ర జైళ్ళశాఖ డైరెక్టర్ శ్రీ వికె సింగ్ గారితో మాట్లాడారు. ఆ సందర్భంగా అయన చెప్పిన విషయాలు చాలా ఆలోచంపజేస్తాయి. జన్మతః బిహార్ రాష్ట్రానికి చెందిన వారైనప్పటికీ అయన మన రాష్ట్రం కోసం, రాష్ట్రంలో నిరుపేద గ్రామీణ ప్రజల కోసం పడుతున్న తపన, నిస్వార్ధంగా చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ఇంటర్వ్యూ వివరాలు:

“జైళ్ళ శాఖలో నాకున్న అనుభవంలో నేను గమనించింది ఏమిటంటే, దేశంలో కొన్ని లక్షల మంది నిరుపేదలు న్యాయ వివాదాలలో చిక్కుకొన్నప్పుడు, లాయర్లను పెట్టుకొని తమ కేసులను వాదించుకొనే ఆర్ధికస్తోమత లేనందున జైళ్ళలో మ్రగ్గుతున్నారు. సుప్రీం కోర్టు మొదలు జిల్లాకోర్టు వరకు కొన్ని లక్షల కేసులు పెండింగులో ఉన్నాయి. వాటికే పూర్తి సమయం కేటాయించి కోర్టులు పనిచేసినా కూడా అవన్నీ పరిష్కారం కావడానికి కొన్ని దశాబ్దాల సమయం పడుతుంది. కనుక ఈ సమస్యకు గ్రామస్థాయిలోనే పరిష్కారం కనుగొనగలిగితే వారికీ మేలు కలుగుతుంది. కోర్టులపై కూడా కేసుల భారం, ఒత్తిడి తగ్గుతుంది.” 

“మన సమాజంలో నెలకొన్న అన్ని సమస్యలకు ‘మీది బాధ్యత అంటే..కాదు..మీదే బాధ్యత’ అని ప్రజలు, అధికారులు, రాజకీయ నేతలు పరస్పరం నిందించుకొంటుంటారు. అయితే ముందుగా ప్రజల ఆలోచనా విధానంలోనే మార్పులు రావలసిన అవసరం ఉంది. అప్పుడే సమర్దులైన వ్యక్తుల చేతులలో అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం మొదలవుతాయి. ఉదాహరణకు మనం మన ఇంటిని నిర్మించుకొంటున్నప్పుడు, చాలా జాగ్రత్తగా సరైన పనివాళ్ళను ఎంపిక చేసుకొంటాము. అదేవిధంగా మన వ్యవస్థలను సమర్ధంగా నిర్వహించుకోవడానికి సమర్ధులైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవలసి ఉంటుంది. సరైన పనివాళ్ళతో కట్టించుకొన్న ఇల్లు దృడంగా ఏర్పడినట్లే, సరైన ప్రజా ప్రతినిధులతో ఏర్పడిన ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మనలో చాలా మంది ఎన్నికలప్పుడు, అభ్యర్ధి అర్హత, గుణగుణాలు వంటివి చూడకుండా అతను లేదా ఆమె కులం, మతం, పార్టీ, ప్రాంతం వంటివి మాత్రమే చూసి ఎన్నుకొంటారు. ఇదే అన్ని సమస్యలకు మూలమని చెప్పవచ్చు. ఆవిధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు, మళ్ళీ ఏవిధంగా అధికారంలోకి రావాలో..అందుకు ప్రజలను ఏవిధంగా మభ్యపెట్టాలనే ఆలోచనలు చేస్తాడు తప్ప పరిపాలనా వ్యవస్థలను పట్టించుకోడు. అధికారంలో ఉన్నవారికి పాలనపై శ్రద్ధ, పట్టు లేనట్లయితే, దాని దుష్ప్రభావాలు ప్రజలపైనే పడుతుంది. అప్పుడు ప్రజలే బాధపడాలి. కనుక ప్రజలలో కూడా మార్పు, సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత చాలా అవసరం. 

మీరు ఈ చర్చ ఆడియో సంభాషణ వినాలనుకుంటే, ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి:

 https://fccdl.in/8xoQjFBiy  

డయల్ యువర్ విల్లేజ్ face book లింక్ :

https://www.facebook.com/groups/821757117915265/ 


Related Post