జియో ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్

November 09, 2017


img

ఇంతకాలం ఉచిత అపరిమిత సర్వీసులు, ఆ తరువాత నామమాత్రపు ధరలు అపరిమిత సర్వీసులు అందజేస్తూ వచ్చిన జియో, కొన్ని రోజుల క్రితమే కొన్ని ప్లాన్స్ ధరలను సవరించి వాటి గడువు కాలాన్ని కుదించింది. దాంతో జియో సేవలు కూడా దాదాపు ఇతర టెలికాం సంస్థలు అందిస్తున్న ప్లాన్స్, ధరలకు ఇంచుమించి సరిసమానం అయినట్లయింది. కనుక సహజంగానే ఇంతకాలం జియోను అంటిపెట్టుకొన్న వినియోగదారులు మళ్ళీ మెల్లగా తమ పాత నెట్ వర్క్ లకు మారడం మొదలైంది. ఇదే అదునుగా, ఇంతకాలం జియో ధాటికి అల్లాడిన ఇతర టెలికాం సంస్థలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి చాలా ఆకర్షనీయమైన ప్లాన్స్ ప్రకటించడం మొదలుపెట్టాయి. దీంతో జియో అప్రమత్తం అయినట్లే ఉంది. అందుకే ఈరోజు మరో ఆకర్షణీయమైన ‘ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్’ ను ప్రకటించింది. అయితే ఇది జియో ప్రైమ్ వినియోగదారులకు మాత్రమే లభిస్తుందని పేర్కొంది. 

ఈ క్యాష్ బ్యాక్ పధకంలో రూ.399 లేదా అంతకంటే ఎక్కువమోత్తం రీఛార్జ్ చేయించుకొన్నట్లయితే రూ.2,599 క్యాష్ బ్యాక్ వినియోగదారులకు లభిస్తుంది. దీనిలో రూ.50 విలువ చేసే 8 ఓచర్లు కలిపి మొత్తం రూ.400 మై జియోలో జమా అవుతాయి. వాటిని రూ.399 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకొన్నప్పుడు ఒక్కో ఓచర్ చొప్పున ఉపయోగించుకోవచ్చు. మిగిలిన దానిలో రూ.300 మొబైల్ వ్యాలెట్ లో జమా అవుతాయి. ఇంకా మిగిలిన రూ.1,899 ఆన్-లైన్ షాపింగ్ కోసం వినియోగదారుడి డిజిటల్ వ్యాలెట్ లో జమా అవుతాయి. వాటి కోసం జియో సంస్థ అమెజాన్ పే, పేటిఎం, ఫోన్ పే, మోబీక్విక్, యాక్సిస్ పే, ఫ్రీ ఛార్జ్ తదితర సంస్థలతో ఒప్పందం చేసుకొంటోంది. ఈ ఆఫర్ నవంబర్ 10 నుంచి 25 వరకు అమలులో ఉంటుందని జియో పేర్కొంది. 

జియో ఇస్తున్న ఈ తాజా ఆఫర్ ను రెండు విధాలుగా విశ్లేషించవచ్చు. 1. జియో సేవలను ఉపయోగించుకొన్నట్లయితే, ఆన్-లైన్ షాపింగ్ ఎక్కువగా చేసుకొనేవారికి అది అందించే ఈ క్యాష్ బ్యాక్ ఓచర్లతో చాలా లబ్ది కలుగుతుంది. 2. దీనినే మరోవిధంగా చెప్పుకొన్నట్లయితే, ఈ ఆఫర్ కావాలనుకొంటే వీలైనంత ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేసుకోక తప్పదు. ఈ క్యాష్ బ్యాక్ ఓచర్లను వినియోగించుకోవాలంటే అవసరం లేకపోయినా తప్పనిసరిగా ఆన్-లైన్ షాపింగ్ కు అలవాటుపడక తప్పదు. కనుక ఎవరికి ఏవిధంగా నచ్చితే ఆవిధంగా దీనిని స్వీకరించవచ్చు. 


Related Post